మహారాణిపేట: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో నగరం నుంచి విమానాశ్రయానికి ప్రయాణికుల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. నగరంలోని ప్రత్యేక లాంజ్‌ల నుంచి ప్రతి అరగంటకు ఒక ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ప్రభుత్వం జిల్లాకు 100 బస్సులు కేటాయించగా, ఇప్పటికే 20 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయని, అవసరాన్ని బట్టి సంఖ్యను పెంచుతామని వెల్లడించారు. విమానాశ్రయానికి ప్రత్యేక ఏసీ బస్సు సేవలు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. విమానాశ్రయానికి అనుసంధానంగా ఉన్న 28 రహదారుల (230 కి.మీ.) అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఏడు ప్రధాన రహదారుల్లో నాలుగు పూర్తికాగా, మరో రెండు ఈ నెలాఖరులోగా పూర్తవుతాయని చెప్పారు. జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, ఏపీఎస్‌ఆర్టీసీ తదితర శాఖల సమన్వయంతో పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశాఖ జిల్లా నుంచి సుమారు 50 వేల మందిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వచ్చే నెల ఒకటో తేదీన రాష్ట్రంలో తొలి సెమీకండక్టర్ తయారీ ప్రాజెక్టు అయిన అసిప్ టెక్నాలజీస్‌కు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సమక్షంలో శంకుస్థాపన జరగనుందని చెప్పారు. ఈ నెల 28న జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణకు 5 నుంచి 10 లక్షల మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. 32 కి.మీ. మార్గంలో తాగునీరు, వైద్య, పారిశుధ్య, పోలీసు సేవలు అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.


