చందనోత్సవానికి సింహగిరి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

చందనోత్సవానికి సింహగిరి సిద్ధం

Apr 13 2026 7:14 AM | Updated on Apr 13 2026 7:14 AM

పకడ్బందీగా ఏర్పాట్లు సామాన్య భక్తులకే పెద్దపీట 70 శాతం టికెట్లు ఆన్‌లైన్‌లోనే.. మీడియా సమావేశంలో దేవస్థానం ఈవో వెంకటరావు

సింహాచలం : సింహాచల పుణ్యక్షేత్రంలో అత్యంత ముఖ్యమైన చందనోత్సవ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు తక్కువ నడకతో సులభతర దర్శనం కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈసారి సామాన్య భక్తులు గతంలో వలె 6 కిలోమీటర్లు కాకుండా, కేవలం 2.5 కిలోమీటర్లు మాత్రమే నడిచేలా మార్గాలను క్రమబద్ధీకరించారు. అదేవిధంగా రూ. 300, రూ. 1000, రూ. 1500 టిక్కెట్ల భక్తులకు కూడా నడక దూరాన్ని తగ్గించినట్టు ఈవో జల్లేపల్లి వెంకట రావు పేర్కొన్నారు. ఆదివారం సింహాచలం పరిపాలనా భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు.

టికెట్లు ..దర్శన వేళలు: దర్శనం టికెట్లను 70 శాతం ఆన్‌లైన్‌ ద్వారా, 30 శాతం ఎంపిక చేసిన యూనియన్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ శాఖల ద్వారా విక్రయిస్తున్నారు. భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని, కేవలం అధికారిక మార్గాల్లోనే టిక్కెట్లు పొందాలని ఈవో వెంకటరావు సూచించారు. టికెట్లపై కేటాయించిన టైమ్‌ స్లాట్‌ ప్రకారం వస్తేనే దర్శనానికి అనుమతి ఉంటుంది. 20వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు వంశపారంపర్య ధర్మకర్త తొలి దర్శనం తర్వాత, ప్రభుత్వం, టీటీడీ తరపున పట్టువస్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు.అనంతరం ఉదయం 4 గంటల నుంచి వీవీఐపీలకు, ఆ తర్వాత సామాన్య భక్తులకు దర్శనాలు కల్పిస్తారు.

రవాణా– పార్కింగ్‌ సదుపాయాలు

భక్తుల తరలింపు కోసం 70 ఆర్టీసీ బస్సులను కేటాయించారు. ఈసారి కొండపైకి ప్రైవేటు ఏసీ బస్సులను అనుమతించడం లేదు. అందరూ ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. కొండ దిగువన 5 పికప్‌ పాయింట్లు, 32 పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. గోశాల నుంచి శ్రీనివాస కల్యాణ మండపం వరకు ఉచిత షటిల్‌ బస్సులు నడపనున్నారు. 19వ తేదీ సాయంత్రం 6 గంటల నుండే కొండపైకి ప్రైవేటు వాహనాల రాకపోకలను నిలిపివేస్తామని ఈవో వెంకటరావు తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని 4 లక్షల వాటర్‌ బాటిళ్లు, లక్ష బిస్కెట్‌ ప్యాకెట్లు, పంపిణీ చేయనున్నారు. పారిశుధ్యం కోసం జీవీఎంసీ సహకారంతో భారీగా మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. భద్రత పరంగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు పోలీస్‌ నిఘా పటిష్టంగా ఉంటుంది. భక్తులకు మార్గనిర్దేశం చేసేందుకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన రూట్‌ మ్యాప్‌ను ప్రవేశపెట్టారు. దర్శనం ముగించుకున్న భక్తుల కోసం లక్షన్నర చిన్న లడ్డూలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. పిఠాపురానికి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా భక్తులందరికీ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. సామగ్రి భద్రపరుచుకునే ఉచిత సౌకర్యం ఉంటుందని ఈవో స్పష్టం చేశారు.

రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి దర్శనాలు బంద్‌

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనాలు మంగళవారం మద్యాహ్నం 2గంటల వరకు మాత్రమే లభిస్తాయని సింహాచలం దేవస్థానం ఈవో జె.వెంకటరావు తెలిపారు. ఆలయంలో జరిగే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సేవ కారణంగా ఈమార్పు చేసినట్టు తెలిపారు. తిరిగి బుధవారం ఉదయం 7గంటల నుంచి యథావిధిగా దర్శనాలు లభిస్తాయని తెలిపారు.

మొరాయించిన సాఫ్ట్‌వేర్‌..

అప్పన్న చందనోత్సవ టికెట్ల ఆన్‌లైన్‌ జారీ ప్రక్రియ ఆదివారం మొదటిరోజే సాంకేతిక ఇబ్బందులతో నిలిచిపోయింది. అధికారులు ముందుగా ప్రకటించిన ప్రకారం రూ.300, రూ.1000 టికెట్ల కోసం భక్తులు ఉదయం నుంచే వెబ్‌సైట్‌ను ఆశ్రయించగా, ‘టీఎమ్‌ఎస్‌’ సాఫ్ట్‌వేర్‌ పనిచేయకపోవడంతో తీవ్ర నిరాశ ఎదురైంది. గంటల తరబడి వేచి చూసిన భక్తులు దేవస్థానం కార్యాలయానికి, ఉన్నతాధికారులకు ఫోన్‌లు చేసి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈవో వెంకటరావు స్పందిస్తూ.. సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని, ఏపీ టీమ్‌ దీనిని పరిష్కరించే పనిలో ఉందని తెలిపారు. త్వరలోనే సమస్యను అధిగమించి టికెట్లు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement