ఫుడ్‌ కోర్టు కార్మికులతో ఎమ్మెల్యే ‘పులి–మేక’ ఆటలు | - | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ కోర్టు కార్మికులతో ఎమ్మెల్యే ‘పులి–మేక’ ఆటలు

Apr 13 2026 7:14 AM | Updated on Apr 13 2026 7:14 AM

ఎమ్మెల్యే వంశీకృష్ణ

‘వాయిదాల’ రాజకీయం

నిప్పులు చెరిగిన

నైట్‌ ఫుడ్‌ కోర్టు కార్మికులు

మా తరఫున గళమెత్తుతున్న

వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం నేతలపై

ఎమ్మెల్యే విమర్శలు మానుకోవాలి

డాబాగార్డెన్స్‌: నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ తప్పుడు ప్రకటనలు మానుకోవాలని, గత ఆరు నెలలుగా తమ జీవితాలతో కాలయాపన చేయడం తగదని జిల్లా తోపుడుబండ్లు, చిల్లర వర్తకుల కార్మిక సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం జగదాంబ జంక్షన్‌ సమీపాన ఉన్న సిటూ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం నాయకులు సింహాచలం, సుబ్బారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే వైఖరిని ఎండగట్టారు. నైట్‌ ఫుడ్‌ కోర్టు తొలగించిన నాటి నుంచి తమ బతుకులు రోడ్డున పడ్డాయని, గత 20 రోజులుగా జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద నిరాహార దీక్షలు చేస్తున్నా పాలకుల్లో చలనం లేకపోవడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాటలను నమ్మి ఆరు నెలలుగా ఆయన చుట్టూ తిరుగుతున్నామని, ఇదిగో పులి.. అదిగో మేక అన్న చందంగా సంక్రాంతికి స్మార్ట్‌ ఫుడ్‌ కోర్టు ప్రారంభిస్తామని చెప్పి ఇప్పుడు ఉగాది దాటిపోయినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ కాలయాపన కారణంగా ఇంటి అద్దెలు కట్టలేక, పిల్లల చదువులకు ఫీజులు చెల్లించలేక, కనీసం మందులు కూడా కొనలేని దుస్థితిలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని వారు కంటతడి పెట్టారు. గతంలో ఎమ్మెల్యే సమక్షంలోనే 97 మందిని అర్హులుగా గుర్తించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు మళ్లీ కొత్తగా అర్హులను ఎంపిక చేయాలని జోనల్‌ కమిషనర్‌కు ఆదేశాలివ్వడం వెనుక అసలు ఉద్దేశం ఏంటని వారు నిలదీశారు.

తమ సమస్యపై గళమెత్తుతున్న వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎంపై ఎమ్మెల్యే విమర్శలు చేయడం సమంజసం కాదని, నిజానికి నైట్‌ ఫుడ్‌ కోర్టు కార్మికులందరూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభ్యత్వం ఉన్నవారేనని వారు స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే గెలుపు కోసం శ్రమించిన కార్మికుల పొట్ట కొట్టడం ధర్మం కాదన్నారు. ఫుడ్‌ కోర్టులో షాపులను అద్దెలకు ఇచ్చుకునే వారితో ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేయిస్తున్నారని, అసలైన బాధితులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సెంట్రల్‌ పార్క్‌ వద్ద నైట్‌ ఫుడ్‌ కోర్టును తక్షణమే యథావిధిగా ప్రారంభించాలని, ఈ సమస్యకు రాజకీయ రంగు పులమకుండా తక్షణమే తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పి.వెంకట్రావు, కె.శ్రీకాంత్‌, దుంగ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement