మహారాణిపేట: పేద, మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరల్లో ఆధునిక వైద్య పరీక్షలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆదివారం జిల్లా పరిషత్ జంక్షన్ వద్ద గల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ‘గెయిల్’ సంస్థ సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన అత్యాధునిక డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రక్తదాన సేవలతో పాటు ఇప్పుడు తక్కువ ఖర్చుతో థైరాయిడ్, క్యాన్సర్ స్క్రీనింగ్, గుండె , కిడ్నీ సంబంధిత పరీక్షలను అందుబాటులోకి తీసుకురావడం ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. తలసేమియా బాధితులకు రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ వై.డి. రామారావు మాట్లాడుతూ.. అత్యాధునిక పరికరాల ద్వారా ఖచ్చితత్వంతో కూడిన పరీక్షలు సామాన్యులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ సి. బాలసతీష్, డీఎంహెచ్‌ఓ జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ మురళీ కృష్ణ పట్నాయక్, ట్రెజరర్ గుడివాడ ప్రసాదరావు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్
మహారాణిపేట: కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలతో నేరుగా అధికారులను కలవవచ్చని సూచించారు. 1100 కాల్ సెంటర్ , అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని, అధికారులు పూర్తి నివేదికలతో హాజరుకావాలని ఆయన ఆదేశించారు.
నేడు డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ
మహారాణిపేట: విద్యుత్ సంబంధిత సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు సోమవారం ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు 86884 00499 ఫోన్ నంబర్ ద్వారా విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను తెలియజేయవచ్చు. విద్యుత్ సరఫరా అంతరాయాలు, వోల్టేజ్ హెచ్చుతగ్గులు, కొత్త కనెక్షన్ల జారీలో జాప్యం, సరఫరా పునరుద్ధరణలో ఆలస్యం, ట్రాన్స్‌ఫార్మర్ మార్పిడి, రూఫ్‌టాప్ సోలార్ వంటి వివిధ సమస్యలను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఈ అవకాశాన్ని సంస్థ పరిధిలోని 11 జిల్లాల విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.


