ఏఐ సమ్మిట్‌లో ఈపీడీసీఎల్ జీఐఎస్ మ్యాపింగ్ ప్రదర్శన
సాక్షి, విశాఖపట్నం: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సమ్మిట్‌లో ఏపీఈపీడీసీఎల్ తన సాంకేతిక ప్రతిభను ప్రదర్శించింది. సంస్థ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ శుక్రవారం సదస్సులో పాల్గొన్నారు. ఏపీఈపీడీసీఎల్‌లో అమలవుతున్న అత్యాధునిక జీఐఎస్ మ్యాపింగ్, డిజిటల్ ట్విన్ కాన్సెప్ట్, ఏఐ ఆధారిత గ్రిడ్ విశ్వసనీయత వ్యవస్థలపై రూపొందించిన ప్రత్యేక వీడియోను అంతర్జాతీయ నిపుణుల సమక్షంలో ప్రదర్శించారు. సంస్థ పరిధిలోని విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లు తదితర నెట్‌వర్క్ ఆస్తులన్నింటినీ శాతం 100 జీఐఎస్‌లో మ్యాప్ చేసి, వాటిని ఎస్‌ఏపీ–ఈఆర్‌పీ, అవుటేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఓఎంఎస్), మొబైల్ ఫీల్డ్ యాప్స్‌తో అనుసంధానించినట్లు తెలిపారు. దీని ద్వారా రియల్‌టైమ్ మానిటరింగ్ సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్ ఆధారిత తనిఖీల ద్వారా వాలిపోయిన స్తంభాలు, తుప్పుపట్టిన క్రాస్ ఆర్మ్‌లు, టిల్ట్ వంటి భద్రతా లోపాలను ఏఐ సాంకేతికతతో గుర్తించే విధానం సదస్సులో పాల్గొన్న ప్రతినిధులను ఆకట్టుకుంది. భవిష్యత్తులో ఏఐ ఆధారిత కమర్షియల్ లాస్ డిటెక్షన్, ఇంటెలిజెంట్ యుటిలిటీ ఆపరేషన్ సెంటర్ (ఐయూఓసీ) ఏర్పాటు వంటి లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని సీఎండీ పృథ్వీతేజ్ వివరించారు. సంప్రదాయ విద్యుత్ పంపిణీ సంస్థగా ఉన్న ఈపీడీసీఎల్ పూర్తిస్థాయి డిజిటల్ వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న తీరు దేశానికే ఆదర్శమని వివిధ దేశాల ప్రతినిధులు ప్రశంసించారు.


