ఇంటర్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట: ఈనెల 23 నుంచి మార్చి 24 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో పరీక్షా ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌ను నియమించి, సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరు, పరిశుభ్రత, నిరంతర విద్యుత్ సరఫరా, హైస్పీడ్ ఇంటర్‌నెట్ సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఇంటర్ పరీక్షలకు మొత్తం 81,001 మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఆర్‌ఐవో మురళీధరన్ తెలిపారు. వీరిలో ప్రథమ సంవత్సరంలో 40,165 మంది, ద్వితీయ సంవత్సరంలో 40,836 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 85 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. సమావేశంలో డీవీఈవో, విద్యాశాఖ, వైద్యారోగ్య, ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, రెవెన్యూ, పోస్టల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.


