
మతోన్మాద, కార్పొరేట్ శక్తుల దాడిపై పోరాటం
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు
కంచరపాలెం: దేశంలో మతోన్మాద, కార్పొరేట్ శక్తుల దాడిని కార్మిక వర్గం ఐక్యంగా ఎదుర్కోవాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. కంచరపాలెంలోని ఓ కమ్యూనిటీ హాల్‌లో రెండు రోజుల పాటు జరిగిన సీఐటీయూ జిల్లా 13వ మహాసభలు ఆదివారం ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన నర్సింగరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటే, గత 1600 రోజులుగా కార్మిక వర్గం పోరాడి అడ్డుకోగలిగిందని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, ప్రజలపై భారం మోపే సర్దుబాటు, ట్రూ అఫ్ చార్జీలను రద్దు చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. డిసెంబర్ 31 నుంచి వచ్చే ఏడాది జనవరి 4 వరకు అఖిల భారత సీఐటీయూ 18వ మహాసభలు జరగనున్నట్లు నర్సింగరావు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి ప్రచారం చేపట్టాలని సీఐటీయూ నాయకులను, కార్యకర్తలను ఆయన కోరారు. కార్యక్రమంలో కె. లోకనాథం, ఆర్. శంకరరావు, ఎం. శ్రీనివాస్, పి. మణి, పి. వెంకటరెడ్డి, ఎం. సుబ్బారావు, ఎల్.జె. నాయుడు, ఒమ్మి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.