ఘోర రోడ్డు ప్రమాదం... భార్యా భర్తలు మృతి | - | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం... భార్యా భర్తలు మృతి

Oct 29 2023 12:52 AM | Updated on Oct 29 2023 9:24 AM

- - Sakshi

అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ఇంటికి వస్తున్న దంపతులు లారీ చక్రాలకు బలైపోయారు.

విశాఖపట్నం: అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ఇంటికి వస్తున్న దంపతులు లారీ చక్రాలకు బలైపోయారు. కూర్మన్నపాలెం జంక్షన్‌లోని నిర్మల్‌ స్కూల్‌ ఎదురుగా శనివారం ఉదయం ఈ ఘోర దుర్ఘటన జరిగింది. దువ్వాడ సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలివీ.. గాజువాక పరిధి సింహగిరికాలనీకి చెందిన గుజ్జి వెంకటరమణారెడ్డి (33), అతని భార్య వరలక్ష్మి దేవి(33)కి 2019లో పెద్దల సమక్షంలో వివాహమైంది. వెంకటరమణ ఎన్‌ఏడీ సమీప నేవీ ఆర్మెమెంట్‌ డిపో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

శనివారం ఉదయం అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారి గుడికి వెళ్లి పూజలు చేశారు. అనంతరం గాజువాకలోని ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. కూర్మన్నపాలెం జంక్షన్‌ దాటి నిర్మల్‌ స్కూల్‌ వద్దకు వచ్చేసరికి ఆటోను తప్పించబోయి కుడి వైపు వెళ్తున్న ట్రాలీ వెనుక చక్రాల కింద పడిపోయారు. తీవ్ర గాయాలు కావడంతో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న దువ్వాడ సీఐ శ్రీనివాసరావు, ట్రాఫిక్‌ ఎస్‌ఐ మహాలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాలీని స్టేషన్‌కు తరలించారు. మృతుడు వెంకటరమణ తండ్రి ఎర్రయ్య ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహం జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా సంతానం కలగకపోవడంతో దంపతులిద్దరూ తిరగని గుళ్లు లేవని, మొక్కని దేవుళ్లు లేరని బంధువులు తెలిపారు. ఈ క్రమంలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని వస్తుండగా ప్రమాదానికి గురై మృతి చెందడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీరి మరణంతో సింహగిరి కాలనీలో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement