ఏయూలోకి ‘నో ఎంట్రీ’ | - | Sakshi
Sakshi News home page

ఏయూలోకి ‘నో ఎంట్రీ’

Feb 20 2026 6:26 AM | Updated on Feb 20 2026 6:26 AM

ఏయూలోకి ‘నో ఎంట్రీ’

ఏయూలోకి ‘నో ఎంట్రీ’

ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ పోటాపోటీ

కార్యక్రమాలతో వర్సిటీలో ఉద్రిక్తత

క్యాంప్‌లోకి బయట వ్యక్తుల

ప్రవేశానికి నిషేధం

రాజకీయ సభలు, ర్యాలీలకు

అనుమతి లేదని నోటీసు

విద్యార్థి సంఘాల ఘర్షణలతో కఠిన ఆంక్షలు

విశాఖ సిటీ : విద్యా వాతావరణానికి ప్రతీకగా నిలవాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయం గత రెండు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొంటోంది. విద్యార్థి సంఘాల మధ్య నెలకొన్న విభేదాలు ఘర్షణలకు దారితీయడంతో విశ్వవిద్యాలయ అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. క్యాంపస్‌లో శాంతిభద్రతలు కాపాడేందుకు బయట వ్యక్తుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ అత్యవసర సర్క్యులర్‌ జారీ చేశారు. అలాగే రాజకీయ సమావేశాలు, సభలు, ర్యాలీలు, ఆందోళనలు, క్యాండిల్‌ ర్యాలీలకు అనుమతి లేదని పేర్కొన్నారు.

ఘర్షణలతో ఉద్రిక్తత

ఏయూలో గత రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణలతో అలజడి రేగింది. మంగళవారం సాయంత్రం క్యాంపస్‌లో జరిగిన ఒక కార్యక్రమం ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. వర్సిటీ ఆవరణలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘పథ సంచాలన్‌’/‘శాఖ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీన్ని ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. విద్యాసంస్థల్లో రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని, ఇది విద్యా వాతావరణాన్ని దెబ్బతీస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ వాదించింది. మరోవైపు, శాంతియుతంగా జరుగుతున్న కార్యక్రమంపై ఎస్‌ఎఫ్‌ఐ శ్రేణులు దాడి చేశాయని, తమ కార్యకర్తలను గాయపరిచారని ఏబీవీపీ ఆరోపించింది. దీనికి నిరసనగా బుధవారం ఏబీవీపీ భారీ ఎత్తున రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

కీలక ఆంక్షలు

క్యాంపస్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి గురువారం రిజిస్ట్రార్‌ కార్యాలయం అత్యవసర నోటీసు జారీ చేసింది. బయటి వ్యక్తుల ప్రవేశంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్యాంపస్‌లో అలజడి సృష్టిస్తున్న బయటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. అలాగే రాజకీయ కార్యకలాపాలకు ఏయూను దూరంగా ఉంచాలని నిర్ణయించారు. రాజకీయ ఉపన్యాసాలు, సమావేశాలు, అనుబంధ కార్యకలాపాలను పూర్తిగా నిషేధించారు. ర్యాలీలు, క్యాంపస్‌ సామరస్యాన్ని దెబ్బతీసే ర్యాలీలు, క్యాండిల్‌ మార్చ్‌లపై ఆంక్షలు విధించారు. ఈ నిబంధనలు అతిక్రమించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో హెచ్చరించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం

అనుమతులపై విచారణ?

ఏయూలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమానికి అసలు అనుమతులు ఎవరు ఇచ్చారు? ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారు? అనే అంశాలపై ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. సాధారణంగా విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం క్యాంపస్‌ ప్రాంగణంలో రాజకీయ, మతపరమైన కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వకూడదనే మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే ఏయూలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అనుమతి ఎవరు ఇచ్చారు? ఏ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు? అధికారుల ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రమేయం ఉందా? పైస్థాయి ఒత్తిళ్లు ఏమైనా ప్రభావం చూపాయా? అనే కోణాల్లో అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ జరుగుతోందన్న వార్తతో ఏయూ పరిపాలన విభాగంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గత ప్రభుత్వాల హయాంలో అమలులో ఉన్న నిబంధనలు, ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాల మధ్య పొంతన లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

విద్యార్థుల్లో ఆందోళన

ఈ వివాదంలో విద్యార్థి సంఘాల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఒక వర్గం యూనివర్సిటీని రాజకీయ వేదికగా మార్చడం సరికాదని పేర్కొంటుండగా, మరో వర్గం తమ భావప్రకటన హక్కును అడ్డుకుంటున్నారని వాదిస్తోంది. పరీక్షలు, అకడమిక్‌ కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు తమ చదువులపై ప్రభావం చూపుతాయేమోనని సాధారణ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement