మాతృశక్తి.. మహాశక్తి
స్ఫూర్తిదాయకంగా సాగిన సప్తశక్తి సంగమ్
మద్దిలపాలెం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘సప్తశక్తి సంగమ్’కార్యక్రమం గురువారం కళాభారతి ఆడిటోరియంలో అట్టహాసంగా ముగిసింది. సుమారు 850 మంది మహిళలు పాల్గొన్న ఈ ముగింపు సభ.. పలువురు వక్తల స్ఫూర్తిదాయక ప్రసంగాలతో విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి సప్తశక్తి సంగమ్ దక్షిణ, దక్షిణ మధ్య క్షేత్రాల సంయోజిక డాక్టర్ భండారు ధరణి ప్రియ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిర్వహించిన 25 వేల మాతృ సమ్మేళనాల్లో సుమారు 30 లక్షల మంది మాతృమూర్తులు పాల్గొన్నట్లు వెల్లడించారు. అలాగే, స్థానికంగా జరిగిన 280 కార్యక్రమాల్లో 28 వేల మంది మహిళలు భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. మహిళలు తమలోని సప్తశక్తులను మేల్కొల్పి దేశ సేవలో భాగం కావాలని, కుటుంబ, పర్యావరణ సంరక్షణలతో పాటు సమాజ వికాసానికి తోడ్పడాలని ఆమె పిలుపునిచ్చారు. గౌరవ అతిథి వెంకట భాను.. మహిళల కుటుంబ సంరక్షణా బాధ్యతలను వివరించారు. ప్రధాన వక్త డాక్టర్ టి.రాధాబాయి ప్రసంగిస్తూ.. భారతీయ సంస్కృతిలోని వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి తత్వాల విశిష్టతను సోదాహరణంగా వివరించారు. మరో వక్త భాగ్యలక్ష్మి ప్రసంగిస్తూ.. దేశ ప్రగతిలో మహిళల పాత్రను, వారు సాధించిన విజయాలను విశ్లేషించారు. ప్రాంత సంయోజికలు అంజలీ ప్రసాద్, ఉమాదేవి ఈ ముగింపు వేడుకను పర్యవేక్షించారు.


