గ్లోబల్‌ సమ్మిట్‌కు నిరంతరాయ విద్యుత్‌ | - | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ సమ్మిట్‌కు నిరంతరాయ విద్యుత్‌

Nov 28 2026 10:35 AM | Updated on Nov 28 2026 10:35 AM

గ్లోబల్‌ సమ్మిట్‌కు నిరంతరాయ విద్యుత్‌ సాక్షి, రంగారెడ్డిజిల్లా: గ్లోబల్‌ సమ్మిట్‌కు నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ జితేష్‌ వి పాటిల్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం మీర్‌ఖాన్‌పేటలోని సభాస్థలిని పరిశీలించారు. వివిధ స్టాళ్లు, పెవిలియన్లు, సభా వేదికలు, ప్రదర్శన ప్రాంతాలను రెడ్కో అధికారులతో కలిసి సందర్శించారు. సమ్మిట్‌లో నిర్వహించనున్న కార్యక్రమాలు, స్టాళ్లు, సెమినార్‌, కాన్ఫరెన్స్‌ హాళ్లు, ముఖ్యమంత్రి, మంత్రుల లాంజ్‌లు, ఫుడ్‌ కోర్టులు, పార్కింగ్‌ తదితర ప్రాంతాలను పరిశీలించి, ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతిస్టాల్‌, సభావేదిక, ప్రదర్శన ప్రాంతానికి అవసరమైన విద్యుత్‌ లోడ్‌ను ముందుగానే అంచనా వేసి 24 గంటల నిరంతరాయ విద్యుత్‌ సరఫరా అందించాలని, ప్రత్యామ్నాయ బ్యాకప్‌ ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. విద్యుత్‌ వైరింగ్‌, కేబుల్స్‌, ప్యానెల్స్‌, ఎర్తింగ్‌, భద్రతా వ్యవస్థలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ప్రత్యేక విద్యుత్‌ పర్యవేక్షణ బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రధాన, అంతర్గత రహదారులు, పార్కింగ్‌ ప్రాంతాల్లో లైటింగ్‌ ఏర్పాట్లపై దృష్టి సారించాలని తెలిపారు. సమ్మిట్‌ విజయవంతానికి విద్యుత్‌ శాఖతో పాటు సంబంధిత ప్రభుత్వ విభాగాలు, నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. తెలంగాణలోని పటిష్టమైన విద్యుత్‌ మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా సామర్థ్యం అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ప్రతిబింబించేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, హరిణి, శృతి హర్షిత, టీజీఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్లు సీహెచ్‌ చక్రపాణి, డాక్టర్‌ ఎన్‌.నరసింహులు, వి.శివాజీ, కృష్ణారెడ్డి, సంబంధిత చీఫ్‌ ఇంజినీర్లు, సూపరింటెండింగ్‌ ఇంజినీర్లు, రెడ్కో అధికారులు పాల్గొన్నారు.

భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

కందుకూరు: ఫ్యూచర్‌సిటీలో త్వరలో జరగనున్న గ్లోబల్‌ సమ్మిట్‌కు సంబంధించిన భద్రతా పరమైన ఏర్పాట్లను శుక్రవారం పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహణ వేదికను సందర్శించి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్‌ నిర్వహణ ప్రణాళికలు, ముందస్తు కార్యాచరణపై సమీక్షించారు. సమ్మిట్‌ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలు, హెలిప్యాడ్‌లు, వసతి ప్రాంతాలను పరిశీలించారు. సమ్మిట్‌ జరగనున్న రోజుల్లో సాఫీగా ట్రాఫిక్‌ రాకపోకలు, ప్రజల భద్రత, సంబంధిత శాఖల మధ్య సమన్వయంపై దృష్టి సారించాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీపీ కె.నారాయణరెడ్డి, ట్రాఫిక్‌ డీసీపీ శివం ఉపాధ్యాయ్‌, ఏసీపీలు రాజు, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్లను పర్యవేక్షించిన రంగారెడ్డి కలెక్టర్‌

కందుకూరు: ఫ్యూచర్‌సిటీలో నిర్వహించనున్న గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్‌ నారాయణరెడ్డి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమ్మిట్‌కు సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ జోనల్‌ మేనేజర్‌ జ్యోతి తదితరులు ఉన్నారు.

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ జితేష్‌ వి పాటిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement