● విలువైన డాక్యుమెంట్లు, బిల్లులు దగ్ధం
బంజారాహిల్స్: ఖైరతాబాద్ జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. కార్యాలయంలోని రెండవ అంతస్తులో ఉన్న ఫైనాన్షియల్ సెక్షన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.రెండవ అంతస్తు నుంచి పెద్ద ఎత్తున మంటలు, పొగలు రావడాన్ని గమనించిన వాచ్‌మెన్ అధికారులకు సమాచారం అందించారు. మూడు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని అరగంట వ్యవధిలో మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే అప్పటికే పెద్ద ఎత్తున ఫైళ్లు, విలువైన డాక్యుమెంట్లు, బిల్లులు అగ్నికి ఆహుతవడంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోన్ ఫైనాన్షియల్ అడ్వైజర్ రమేష్ కార్యాలయంలో ఈ ప్రమాదం జరిగింది.
2018లోనూ...
ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2018లోను దాదాపుగా ఇదే సమయంలో అగ్నిప్రమాదం జరగడం ..ఆప్పుడు కూడా షార్ట్ సర్క్యూట్‌గా పేర్కొనడం గమనార్హం. అప్పట్లో మొదటి అంతస్తులోని ఆడిట్ గదిలో జరిగింది. రెండు ఫైరింజన్లు, 12 మంది సిబ్బంది దాదాపు గంటన్నరపాటు శ్రమించి మంటలను ఆర్పారు. దాదాపు పది లక్షల విలువై న ఆస్తినష్టం జరిగింది.ఫైళ్లు, కంప్యూటర్లు, ఫర్నిచర్ దెబ్బతిన్నాయి.రెండు ఘటనలూ ఒకే మాదిరిగా ఉండటంతో నిధుల గోల్‌మాల్‌లకు సంబంధించిన ఫైళ్లు ఉండవచ్చుననే అనుమానాలు విస్తృతంగా ప్రచారమయ్యాయి.


