ఇబ్రహీంపట్నం: వీబీజీ రాంజీ పథకం కింద అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పిండమే లక్ష్యమని, అందుకు మేట్స్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఎల్.శ్రీలత అన్నారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం మేట్స్‌కు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 40 మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించి 365 రోజులు పనులు కల్పిస్తున్నామన్నారు. ఎక్కువ మంది కూలీలు పనికి హాజరవుతున్న తరుణంలో వారికి సరైన కొలతలు ఇవ్వడం, రోజువారీ వేతనం సక్రమంగా వచ్చేట్లు చూడటం, హాజరు నమోదు చేయడం తదితర అంశాలల్లో ఇబ్బందులు తొలగించే ఉద్దేశంతో మేట్స్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం తుర్కగూడెం ఫీల్డ్ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ మృతి చెందిన కత్తుల లక్ష్మయ్య భార్య బుగ్గమ్మకు సర్పంచ్ నరేందర్‌రెడ్డితో కలిసి రూ.లక్ష చెక్కును అందజేశారు. చర్లపటేల్‌గూడలో సర్పంచ్ గణేశ్‌తో కలిసి పని ప్రదేశాన్ని డీఆర్డీవో శ్రీలత సందర్శించారు. కూలీలకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటుతున్న నేపథ్యంలో ప్రతి ఇంటికీ ఒక ఇంకుడు గుంత నిర్మించి పడిన వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ పీడీ సుభాషిణి, ఏపీడీ శేష్‌కుమార్, ఎంపీడీఓ ప్రమీలనాయక్, ఏపీవో బి.తిరుపతిచారి, ఈసీ రవికుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సాంకేతిక సహాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
రంగారెడ్డి గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత


