నిధుల నైరాశ్యం! | - | Sakshi
Sakshi News home page

నిధుల నైరాశ్యం!

Nov 7 2026 10:11 AM | Updated on Nov 7 2026 10:11 AM

● పాలమూరు ఎత్తిపోతల పథకం నీటితో జిల్లా రైతుల పాదాలు తడుపుతామన్న హామీ ప్రజాభిప్రాయ సేకరణతో ఆగిపోయింది. ● మున్సిపాలిటీలకే ప్రత్యేక నిధులు ఇస్తామన్న హామీ నెరవేరక అభివృద్ధి కుంటు పడుతోంది. ● అనంతగిరి పర్యాటక అభివృద్ధి నత్తను తలపిస్తోంది. ● తాండూరులో ఈఎస్‌ఐ ఆస్పత్రి కలగానే మిగిలిపోయింది. ● ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు హామీ అమలుకు నోచుకోలేదు. ● వికారాబాద్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తను తలపిస్తున్నాయి. ● వికారాబాద్‌ సమీపంలోని శివారెడ్డిపేట చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా తీర్చి దిద్దాలని పట్టణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ● తాండూరు, పరిగి, వికారాబాద్‌ నియోజకవర్గాల్లో రోడ్ల విస్తరణ, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో పురోగతి లేదు. ● మన్నెగూడ – వికారాబాద్‌ నలుగు లేన్ల రహదారి పనుల్లో ముందడు పడలేదు. ● వికారాబాద్‌ – నవాబుపేట్‌ మీదుగా శంకర్‌పల్లి వరకు రోడ్డు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ● నాలుగు మున్సిపాలిటీల్లో రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలను బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ● వికారాబాద్‌ రింగ్‌రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

కొడంగల్‌ దాటని అభివృద్ధి బేరీజు వేసుకుంటున్న మూడు నియోజకవర్గాల ప్రజలు ఎమ్మెల్యేలు, స్పీకర్‌కు తలనొప్పిగా మారిన వ్యవహారం ప్రతిపక్షాల నుంచి విమర్శలు

వికారాబాద్‌: సొంత నియోజకవర్గం కొడంగల్‌ అభివృద్ధిని సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి తరచూ సమీక్షలు చేస్తూ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. రూ.వేల కోట్లు మంజూరు చేస్తున్నారు. ప్రతి నెలా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. వరుస సమీక్షలు చేస్తుండటంతో అధికారులు పనుల్లో వేగం పెంచుతున్నారు. ఏ మాత్రం జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. దసరా పండుగకు వచ్చిన సీఎం నెల తిరక్కుండానే మరో మారు కొడంగల్‌ పర్యటనకు వస్తున్నారు. వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

అక్కడ అభివృద్ధి.. ఇక్కడ అసంతృప్తి

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో జిల్లా వివక్షకు గురైందనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వస్తున్న వ్యక్తులు సీఎం, స్పీకర్‌గా ఉండటంతో జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుందని అందరూ భావించారు. కానీ అభివృద్ధి కొడంగల్‌ దాటడం లేదనే విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. నిధుల మంజూరులో మిగిలిన మూడు నియోజకవర్గాలపై వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీలు కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయి. ఏడాది క్రితం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు నిధులు మంజూరయ్యాయంటూ హడావుడి చేశారు. శిలాఫలకాలు, భూమి పూజలు చేశారు. ఎనిమిది నెలలు గడిచినా పనులు ప్రారంభం కావడంలేదు. కొడంగల్‌ నియోజకవర్గంలోని బొంరాస్‌పేట, కొడంగల్‌, దుద్యాల మండలాలు అభివృద్ధిలో పరుగులు పెడుతుండగా వికారాబాద్‌, తాండూరు, పరిగి నియోజకవర్గాలు నిధులు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. కొడంగల్‌ అభివృద్ధిని కళ్లారా చూస్తున్న ఇతర మండలాల ప్రజలు ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిగి, తాండూరు, వికారాబాద్‌ ఎమ్మెల్యే(స్పీకర్‌)లు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ప్రతి నెలా కొడంగల్‌కు వచ్చే సీఎం మిగిలిన నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఎమ్మెల్యేలు ప్రజలకు ఏం చెప్పాలో తెలియక హైరానా పడుతున్నారు. ఒకింత అసంతృప్తికి లోనవుతున్న సమాచారం. ఇదే విషయాన్ని సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని అనేక రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు ప్రారంభమైనా తీవ్ర జాప్యం జరుగుతోంది. కొన్ని శిలాఫలకాలు దాటడం లేదు. ఇవన్నీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారినట్లు సమాచారం. నిధుల మంజూరులో చోటు చేసుకుంటున్న వివక్షపై విపక్షాలు కూడా గట్టిగానే ఆరోపిస్తున్నాయి. వాటిని ఎలా తిప్పికొట్టాలతో తెలియని స్థితిలో పాలకులు ఉన్నారు.

అమలు కాని హామీలు కొన్ని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement