రేషన్ డీలర్ల మాయాజాలం అంత్యోదయ కార్డుదారులకుఅందని చక్కెర
బషీరాబాద్: పేదల ఇళ్లలో పండుగ పూట తీపి నింపాల్సిన సబ్సిడీ పంచదార పక్కదారి పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంత్యోదయ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కేటాయిస్తున్న చక్కెర సక్రమంగా అందడం లేదు. జిల్లాలో 26,484 మంది అంత్యోదయ లబ్ధిదారులుండగా.. నెలకు ఒక్కొక్కరికి కిలో చొప్పున 264.84 క్వింటాళ్ల పంచదార అవసరం. అయితే ఈ ఏడాది మార్చిలో ఒక్కసారే జిల్లాకు చక్కెర సరఫరా అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
బియ్యం పంపిణీ మాటున..
ఆగస్టు నెలలో మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన సమయంలో ఒక్కో కార్డుదారుడికి మూడు కిలోల చక్కెర ఇవ్వాల్సి ఉంది. కానీ సుమారు 90 శాతం మంది లబ్ధిదారులకు అందలేదని తెలుస్తోంది. కొందరు డీలర్లు చక్కెరను తీసుకెళ్లకపోగా.. మరికొందరు తీసుకెళ్లినా పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో పేదలు మార్కెట్‌లో కిలోకు రూ.60 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీపావళి సందర్భంగా కూడా చాలామంది లబ్ధిదారులకు పంచదార అందలేదు. సైట్ తెరుచుకోకపోవడం, డీడీలు చెల్లించలేకపోవడం సాకులుగా చెబుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గోదాముల్లో నిల్వలున్నా పంపిణీ జరగకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో రేషన్ కార్డుల లెక్కలు ఇలా..
నియోజకవర్గం అంత్యోదయ మొత్తం
కార్డులు కార్డులు
తాండూరు 6,948 84,369
వికారాబాద్ 6,241 78,830
పరిగి 10,520 80,231
కొడంగల్ 2,775 49,029
పంపిణీ చేయకుంటే చర్యలు
జిల్లాలో ప్రస్తుతం 60 క్వింటాళ్ల పంచదార నిల్వలున్నాయి. డీలర్లు డీడీలు చెల్లించి గోదాముల నుంచి తీసుకెళ్లాలి. తీసుకున్న చక్కెరను తప్పనిసరిగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలి. పంపిణీ గణాంకాలు సమర్పించాలి. అక్రమాలు జరిగినట్లు తేలితే సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకుంటాం.
– నర్సింహులు, డీఎం, పౌరసరఫరాల శాఖ


