వికారాబాద్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపసుడుతున్న అమృత్ 2.0 పథకం పనులు నత్తను తలపిస్తున్నాయి. ఈ స్కీం కింద జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు రూ.59 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ బిల్లులు రావడం లేదంటూ పనులను పక్కన పెట్టేసింది. అమృత్ నిధులతో చేపట్టాల్సిన తాగునీటి సరఫరా పనులు లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నాయి. రెండున్నరేళ్లు దాటినా వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారాయి. ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి నెలకొనే అవకాశమున్న ప్రస్తుత తరుణంలో అమృత్ పనులు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బోర్లు, బావులు అడుగంటుతున్నాయి.
2017 డీపీఆర్ ప్రకారమే పనులు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ 2.0 పథకం కింద ట్యాంకుల నిర్మాణానికి నిధులు కేటాయించారు. మున్సిపాలిటీల్లో తాగునీటి ఎద్దడి లేకుండా, ప్రతీ ఇంటికి నల్లాల ద్వారా నీరు సరఫరా అయ్యేలా ట్యాంకుల నిర్మాణ పనులు ప్రారంభించారు. 2017లో రూపొందించిన డీపీఆర్ ప్రకారం పనులు చేస్తుడంతో పెరిగిన, ఆవాసాలు జనాభాకు అనుగుణంగా నీళ్లు అందే పరిస్థితి కనిపించడం లేదు. సదరు కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం ఇప్పటికే ఏడుసార్లు షోకాజ్ నోటీసులు అందించినా ఎలాంటి స్పందన లేదు. ఈ పథకం కింద నూతనంగా నీటి వనరులను సృష్టించటం కాకుండా, ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకునే పనులు చేపట్టారు. మున్సిపాలిటీల్లో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్‌ల ఏర్పాటు, నల్లాల కనెక్షన్లు తదితర పనులు చేపట్టాల్సి ఉంది.
● జిల్లాలో రెండు చోట్ల వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు(నీటి శుద్ధి కేంద్రాలు) అందుబాటులో ఉన్నాయి.
● పరిగి మండలం జాఫర్‌పల్లి సమీపంలోని ప్లాంటుకు రోజుకు 135 ఎంఎల్‌డీ(మిలియన్ లీటర్ పర్ డే) నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉంది.
● కొడగంల్‌లోని ప్లాంటు 17 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన ఉంది.
● నిత్యం 18 నుంచి 22 గంటలు వీటిలో నీటిని శుద్ధి చేస్తారు.
● జిల్లాలో ప్రస్తుతం సుమారు 11.5 లక్షల జనాభా నివసిస్తుండగా, వీరికి నిత్యం 130 ఎంఎల్‌డీ నీరు అవసరం.
● రెండు ప్లాంట్లకు నిత్యం 145 ఎంఎల్‌డీ నీటిని శుద్ధి చేసి, పంపింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, ట్యాంకుల నిర్మాణం పూర్తికాక, పైప్‌లైన్ల అసంపూర్తి పనులతో నీటి సరఫరా సక్రమంగా కావడం లేదు.
● కొన్ని కాలనీల్లో రెండు రోజులకు ఒకసారి, మరికొన్ని కాలనీలకు మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు.
పరిగిలోని తిరుమల, మైత్రి వెంచర్, వెంకటేశ్వర టెంపుల్ కాలనీల్లో రెండేళ్లుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఈ కాలనీల్లో ఉన్న బోరుబావులు కూడా అడుగంటడంతో స్థానికులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. ఇలా మున్సిపాలిటీల పరిధిలోని అనేక కాలనీల్లో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నియోజకవర్గం నిధులు జనాభా
తాండూరు రూ.27 కోట్లు 95 వేలు
పరిగి రూ.15.5 కోట్లు 35 వేలు
వికారాబాద్ రూ.12 కోట్లు 85 వేలు
కొడంగల్ రూ.4.5 కోట్లు 25 వేలు
అడుగంటుతున్న బోరుబావులు
ముందుకు సాగని అమృత్ పథకం పనులు
ప్రారంభించి రెండున్నరేళ్లు దాటినా పూర్తికాని వైనం
ఏడుసార్లు నోటీసులిచ్చినా స్పందించని కాంట్రాక్ట్ సంస్థ


