బషీరాబాద్: పత్తి రైతుకు కష్టాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఓవైపు పెట్టుబడులు పెరిగి.. మరోవైపు వర్షాభావంతో దిగుబడులు తగ్గి అన్నదాతలు అల్లాడుతున్నారు. దీనికితోడు మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో ఆశించిన ఆదాయం దక్కడం లేదు. సీజన్ ప్రారంభంలో క్వింటాలుకు రూ.9,250 పలికిన ధర వారం రోజుల్లోనే రూ.350 తగ్గి తాండూరులో రూ.8,900కు చేరింది. దీనికితోడు జిన్నింగ్ మిల్లుల్లో నగదు చెల్లింపుల పేరుతో కోతలు విధిస్తున్నారన్న రైతుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రాంతాల వారీగా ధరల్లో వ్యత్యాసాలు, చెల్లింపుల్లో కోతలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను ప్రభావితం చేస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎకరాకు రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టినా.. దిగుబడి తగ్గడంతో సాగు ఖర్చులైనా తిరిగొస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు.
వ్యాపారుల మాయాజాలం
జిల్లాలో 14 జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. అక్టోబరు 31 నాటికి మార్కెట్లలో క్వింటాలుకు కనిష్ట ధర రూ.8,401, గరిష్ట ధర రూ.9,050గా నమోదైంది. తాండూరులో రూ.8,720 నుంచి రూ.8,900 వరకు ధర చేరింది. కొడంగల్‌లో రూ.8,401 నుంచి రూ.8,901 వరకు, ధారూరులో రూ.8,700 నుంచి రూ.8,900 వరకు ధరలు నమోదయ్యాయి. పరిగిలో రూ.8,700 నుంచి రూ.9,000 వరకు ధర పలికింది. మర్పల్లిలో గరిష్టంగా రూ.9,050 ధర నమోదైంది. కోటిపల్లిలో రూ.8,900 నుంచి రూ.9,000 వరకు ధర పలికింది. నాణ్యత, తేమ శాతాన్ని బట్టి ధరల్లో మార్పులుంటాయని వ్యాపారులు చెప్పుకొస్తున్నారు. ప్రాంతాల వారీగా కనిపిస్తున్న వ్యత్యాసాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాండూరులో వారం రోజుల్లోనే క్వింటాలుకు రూ.350 తగ్గడంతో అన్నదాతలకు నిరాశ ఎదురవుతోంది. ఒకే నాణ్యత కలిగిన పత్తికి ధరల నిర్ణయంలో తేడాలు ఉండడం రైతుల్లో అనుమానాలకు తావిస్తోంది.
కొనుగోళ్లు ఇలా..
జిల్లాలోని ఏడు వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో 2,01,545 ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ సీజన్‌లో 1,77,329 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. అక్టోబరు 31న ఒక్కరోజే 626.24 మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం సేకరణ 8,653.78 మెట్రిక్ టన్నులకు చేరింది. ఇందులో తాండూరు మార్కెట్ పరిధిలో అత్యధికంగా 4,325.04 మెట్రిక్ టన్నులు, కొడంగల్‌లో 3,745.85 మెట్రిక్ టన్నుల పత్తి సేకరించారు. కొనుగోళ్లలో ధరల నిర్ణయం, తూకం, తేమ శాతం ఆధారంగా చేసే కోతలు, చెల్లింపులపై అధికారులు నిఘా పెంచాలని రైతులు కోరుతున్నారు.
నగదు చెల్లింపుల్లో కోతలు
పత్తికి క్వింటాలుకు సీసీఐ కనీస మద్దతు ధర రూ.8,667గా ఉంది. అయితే బహిరంగ మార్కెట్‌లో సీజన్ మొదట్లో ధరలు గరిష్టంగా రూ.9,250 వరకు పలకడంతో రైతులు నేరుగా జిన్నింగ్ మిల్లుల్లో విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సాగు, కూలీ, పత్తి ఏరడం, రవాణా ఖర్చులు పోను అంతంతమాత్రంగానే ఆదాయం మిగులుతోందని చెబుతున్నారు. దీనికితోడు నగదు చెల్లింపుల పేరుతో లక్ష రూపాయలకు రూ.వెయ్యి చొప్పున కమీషన్ కోత విధిస్తున్నారని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను నియంత్రిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలపై అధికారులు విచారణ జరిపి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వారం రోజుల్లో క్వింటాలుకు రూ.350 కోత
తాండూరులో రూ.8,900కు పడిపోయిన ధర
ఇతర ప్రాంతాలతో పోలిస్తే ధరల్లో వ్యత్యాసం
నగదు చెల్లింపుల పేరుతో చేతివాటం
జిల్లాలో పత్తిసాగు ఇలా..
పంట వేసింది 2.01లక్షల ఎకరాల్లో..
దిగుబడి అంచనా 1.77లక్షల మెట్రిక్ టన్నులు
ఎంపిక చేసిన మిల్లులు 14
ఇప్పటి వరకు సేకరించింది 8,653.78 మెట్రిక్ టన్నులు


