బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్
బంట్వారం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు గడువు ఈ నెల చివరి వరకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అత్తెల్లి లక్ష్మణ్ యాదవ్ కోరారు. ఆదివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు 50శాతం కూడా నమోదు కాలేదన్నారు. గడువు తక్కువగా ఉన్నందున వేలాది మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కమిషన్ గడువు పెంచాలని కోరారు. ఇదే విషయమై సంఘం తరఫున ఎస్‌ఈసీని కలిసి వినతిపత్రం అందజేస్తామన్నారు. 2026 నవంబర్ కంటే మూడేళ్ల ముందు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
అనంతగిరి: అర్హులైన పట్టభద్రులు ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు సూచించారు. ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఆయన పాల్గొని పట్టపద్రులతో ఓటరుగా నమోదు చేయించారు.
అనంతగిరి: దేశ సంస్కృతి, సంప్రదాయాలు యావత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయని ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంపర్క్ ప్రముఖ్ సిద్ది రామేశ్వర్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలో పద సంచలన్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ అంటే దేశభక్తి కలిగిన సంస్థ అన్నారు. కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు, నాయకులు, వ్యాపారులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మర్పల్లి: మండలంలోని పంచలింగాల గ్రామ సమీపంలో గల ఓ వ్యవసాయ పొలంలో మొసలి కలకలం రేపింది. గ్రామానికి చెందిన మొగులయ్య ఎప్పటిలాగే ఆదివారం ఉదయం పొలానికి వెళ్లాడు. మొసలి కనిపించడంతో భయాందోళన చెందాడు. చుట్టుపక్కల రైతుల సహాయంతో దాన్ని తాళ్లతో బంధించి గ్రామానికి తీసుకువచ్చాడు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలిపాడు. వారు గ్రామానికి చేరుకొని మొసలిని సంగారెడ్డి జిల్లా మంజీరా ప్రాజెక్టులో వదిలేందుకు తీసుకెళ్లారు.
దోమ: మండల వ్యాప్తంగా శనివారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పిడుగు పాటుకు చెట్టు దెబ్బతింది.
దోమ: బాలికను వేధించిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన దోమ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వసంత్ జాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన బాలిక(16)ను సిద్ది గణేశ్ అనే యువకుడు మూడేళ్లుగా ప్రేమించాలని వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


