అనంతగిరి: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ సైబర్ క్రైమ్ డీఎస్పీ కాజల్ జైస్వాల్ అన్నారు. శనివారం రాత్రి వికారాబాద్‌లో కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫోన్లలో వచ్చే అనవసరమైన లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పకూడదని తెలిపారు. ఏ బ్యాంకు కూడా మనకు ఫోన్ చేసి ఓటీపీ అడగదనే విషయాన్ని గ్రహించాలన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ టౌన్ సీఐ రఘుకుమార్, ఎస్‌ఐలు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
● సీఎం రేవంత్‌రెడ్డి సభకు సామగ్రి తరలిస్తున్న వాహనం
● పరిగిలోని అమరవీరుల స్తూపం వద్ద పల్టీ
పరిగి: కొడంగల్‌లో మూడు రోజుల పాటు కొనసాగనున్న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కోసం సామగ్రితో వెళ్తున్న ఓ డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటన పరిగి పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనె 7నుంచి 9వ తేదీ వరకు సీఎం తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్టేజీ ఏర్పాటు కోసం సామగ్రి నింపుకొన్న డీసీఎం శుక్రవారం శంషాబాద్ నుంచి హకీంపేట్‌కు బయలుదేరింది. పరిగిలోని అమరవీరుల స్తూపం వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టింది. సామగ్రి మొత్తం చెల్లాచెదురుగా పడిపోవడంతో హైదారాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై పడిన సామగ్రిని తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
బొంరాస్‌పేట: దుద్యాల మండలం హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌లో ఈనెల 7నుంచి 9వరకు జరిగే రైతు మేళా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం చేపట్టిన ఏర్పాట్లను శనివారం సాయంత్రం కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహమెహ్ర పరిశీలించారు. వీరి వెంట ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ అనిత, డీఏఓ కవిత ఉన్నారు.
ప్రాణాలు కాపాడిన
డయల్ 100
ఇబ్రహీంపట్నం: చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటానని 100కు డయల్ చేసిన ఓ మహిళను ఇబ్రహీంపట్నం పోలీసులు కాపాడారు. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..కర్ణంగూడ వైపు నుంచి పెద్ద చెరువు వైపు వస్తూ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ మహిళ 100కు డయల్ చేయడంతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరిగి ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే ఎలాంటి స్పందన రాకపోవడంతో వెంటనే చెరువు పరిసర ప్రాంతాలను గాలించారు. చెరువు వైపు వెళ్తున్న మహిళను గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. ఆమె ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మహిళ ప్రవర్తను బట్టి మానసిక స్థితి బాగాలేదని గుర్తించి హయత్‌నగర్‌లోని అనాథాశ్రమానికి తరలించారు.


