● తాగునీరు, కరెంట్ సమస్యలపై అప్రమత్తంగా ఉండండి
● వివిధ శాఖల అధికారులకు కలెక్టర్ దీపక్ తివారి ఆదేశం
అనంతగిరి: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రానున్న ఎనిమిది నెలల పాటు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. ఈ మేరకు శనివారం జిల్లాలో తాగునీరు, విద్యుత్ సరఫరా, వీబీజీరాంజీ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరా, పశుగ్రాసం, నీటి వనరుల లభ్యత, వేసవిలో ఎదురయ్యే సమస్యలు, పరిష్కారానికి చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తాగునీటి సమస్యలు తలెత్తే ప్రాంతాలను ముందుగానే గుర్తించాలన్నారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గ్రామ, మండల, పట్టణ స్థాయిలో గుర్తించిన సమస్యలను వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తేవాలన్నారు.
పొదుపుగా వాడుకోవాలి..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఉన్న బోర్లు, నీటి వనరులు, లభ్యత, డిమాండ్‌పై చర్చించారు. తాగునీరు, కరెంటును పొదుపుగా వాడుకోవాలని, ఈ అంశాలపై కళాజాతల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో రైతులు వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా చూడాలన్నారు. అనుమతి లేకుండా చెరువుల్లో బోర్లు వేసినా, నీటిని వృథా చేసినా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజు గుటూరు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.


