● సర్దార్ వల్లభాయ్ సేవలను కొనియాడిన కలెక్టర్, ఎస్పీ
● వికారాబాద్‌లో 2కే రన్
అనంతగిరి: అన్ని సంస్థానాలను ఏకం చేసి భారతదేశ ఐక్యతకు బలమైన పునాది వేసిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కలెక్టర్ దీపక్ తివారి కొనియాడారు. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉక్కుమనిషి పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్నేపల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు 2కె రన్ నిర్వహించారు. ప్రతిఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ..కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరూ జాతీయ భావనతో ముందుకు సాగాలన్నారు. ఈ రన్‌లో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, వికారాబాద్ డీఎస్పీ అంజయ్య ఏఆర్ డీఎస్పీ వీరేశ్, వికారాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్ రఘు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దేశ సమగ్రత అందరి బాధ్యత
దేశ సమగ్రతను కాపడటం ప్రతిఒక్కరి బాధ్యత అని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్), ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడటం, ప్రజల మధ్య ఐకమత్యం, సోదరభావాన్ని పెంపొందించడం ప్రతీ పౌరుడి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేశ్ మీనా, డీసీఆర్‌బీ డీఎస్పీ జానయ్య, డీటీసీ డీఎస్పీ శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ వీరేశ్ ఇతర పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


