కందుకూరు: ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి శుక్రవారం జాయింట్ సీపీ చందనాదీప్తి, డీసీపీ నారాయణరెడ్డి తదితరులతో కలిసి ఫ్యూచర్‌సిటీలో పర్యటించారు. డిసెంబర్ 7,8,9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి స్కిల్స్ యూనివర్సిటీలో కొనసాగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. నిర్మాణ పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంతో పాటు నిర్మాణంలో ఉన్న 330 అడుగుల రేడియల్ రహదారిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమ్మిట్ ప్రాంతానికి వచ్చే సీఎం, మంత్రులు, ఇతర ముఖ్య ఆహ్వానితుల కోసం చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం టీజీఐఐసీ, హెచ్‌జీసీఎల్, ఆర్ అండ్ బీ, హెచ్ఎండీఏ అధికారులతో పాటు నిర్మాణ సంస్థలైన కేఎంవీ, ఆర్ఎన్ఆర్, రిత్విక్ నిర్వాహకులతో పనుల పురోగతిపై సమీక్షించి పలు సూచనలు చేశారు. వారి వెంట ఏసీపీ జానకీరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, సీఐ సత్యనారాయణ ఉన్నారు.


