పీఎం రహత్ పథకానికి కేంద్రం శ్రీకారం గుర్తింపు పొందిన ఆస్పత్రిలో సేవలు గరిష్టంగా రూ.1.50 లక్షల దాకా.. వారం రోజుల వరకుట్రీట్‌మెంట్ తీసుకునే అవకాశం
మొయినాబాద్: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు ఆస్పత్రుల్లో నగదు చెల్లించకుండానే వైద్య చికిత్స పొందొచ్చు. డబ్బు లేకపోయినా ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారంచుట్టింది. పీఎం–రహత్ (ప్రధాన మంత్రి– రోడ్డు యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అసురెడ్ ట్రీట్‌మెంట్) పేరుతో నగదు రహిత వైద్య చికిత్స పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించింది.
రోడ్డు ప్రమాదంలో గాయపడితే..
మోటారు వాహనాలతో జరిగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారు పీఎం–రహత్ పథకం ద్వారా నగదు రహితంగా వైద్య చికిత్స పొందొచ్చు. ఒక్కో బాధితుడికి గరిష్టంగా రూ.1,50,000 పరిమితి వరకు చికిత్స అందిస్తారు. ప్రమాదం జరిగిన తేదీ నుంచి వారం రోజుల వరకు చికిత్స పొందే అవకాశం ఉంది. ఈ పథకం కింద దేశంలో గుర్తింపు పొందిన అన్ని ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్స అందిస్తారు.
పథకానికి అర్హులు
ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా..
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితుడి ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రమాదం జరిగిన వెంటనే 112 అత్యవసర సేవలకోసం సమాచారం ఇవ్వాలి. అవసరమైతే అంబులెన్స్ కోరాలి. బాధితుడి పరిస్థితిని బట్టి సమీపంలోని తగిన ఆస్పత్రికి తరలించేందుకు సహాయం పొందాలి. బాధితుడిని పథకం కింద గుర్తింపు పొందిన ఆస్పత్రిలో చేర్పించాలి. ఆస్పత్రి వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభిస్తారు. ప్రమాద వివరాలను సంబంధిత పోలీసు వ్యవస్థ ద్వారా ధ్రువీకరించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆస్పత్రి పథకం పోర్టల్‌లో చికిత్స వివరాలను నమోదు చేస్తుంది. అర్హత, చికిత్స వివరాలు, సంబంధిత అనుమతులను పరిశీలిస్తారు. ఆమోదించిన వైద్య చికిత్స ఖర్చుకు సంబంధించిన క్లెయిమ్‌ను ఆస్పత్రి సమర్పిస్తుంది. పథకం అమలులో 112 అత్యవసర సేవలు, పోలీసుల ప్రమాద నివేదికలు, ఆస్పత్రుల చికిత్స వివరాలు డిజిటల్ విధానంలో అనుసంధానం చేస్తారు.
పోలీసులకు సమాచారం
ప్రమాదం జరిగిన 24 గంటల్లో..
ఈ పథకం మార్గదర్శకాల ప్రకారం ప్రమాదం జరిగిన 24 గంటల లోపే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాలి. 24 గంటల తర్వాత ఆస్పత్రిలో చేరిన బాధితులు ఈ పథకానికి అర్హులు కారు. ప్రమాదం జరిగిన వెంటనే వైద్య సహాయం పొందడం అత్యంత ముఖ్యం.
ఆస్పత్రికి డబ్బుల చెల్లింపు
పథకం నిబంధనల ప్రకారం ప్రమాదానికి కారణమైన వాహనం బీమా కలిగి ఉంటే, సంబంధిత సాధారణ బీమా సంస్థల నుంచి, బీమా లేని వాహనాలు, హిట్ అండ్ రన్ కేసుల వంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ద్వారా చెల్లింపులు జరుగుతాయి. ఆస్పత్రి చికిత్స వివరాలను నమోదు చేసి, క్లెయిమ్‌ను సమర్పిస్తుంది. ఆమోదించిన క్లెయిమ్‌లకు నిబంధనల ప్రకారం చెల్లింపులు జరుగుతాయి. క్లెయిమ్ ఆమోదం పొందిన తర్వాత చెల్లింపుల కోసం ప్రభుత్వం పది రోజుల గడువు నిర్దేశించింది.
నగదు రహిత వైద్య చికిత్స


