ఇబ్రహీంపట్నం: భూసేకరణలో అవినీతి, అక్రమాలను సహించేదిలేదని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. యాచారం మండలం మొండిగౌరెల్లిలో భూసేకరణలో భాగంగా ప్రభుత్వ భూమిలో కబ్జాలో ఉన్న బాధిత రైతులకు ఎకరాకు రూ.30 లక్షల చొప్పున నష్టపరిహారం, 121 గజాల ప్లాట్లును సర్కార్ అందజేస్తుందని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఇబ్రహీంపట్నం ప్రజాభవన్‌లో ఆ గ్రామానికి చెందిన 19 మంది బాధిత రైతులకు మొదటి విడతలో 26.36 ఎకరాల భూమికి సంబంధించి రూ.8.7 కోట్ల నష్టపరిహారం చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుకు 20 వేల ఎకరాల భూసేకరణ చేసి నామమాత్రపు పరిహారం ఇచ్చి రైతుల పొట్ట కొట్టి లూటీ చేసిందని ఆరోపించారు. విషం చిమ్మే ఫార్మాను రద్దు చేసి ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ మేలు చేస్తోందన్నారు. రైతులకు అండగా నిలుస్తుందని, మొండిగౌరెల్లిలో సేకరించే 677 ఎకరాల భూమిలో విమానాల పరికరాల తయారీ ఇండస్ట్రీ ఏర్పాటు కానున్నట్లు చెప్పారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి లంచాలు తినే అధికారి కాదని కితాబిచ్చారు. భూసేకరణలో ఏదైనా అన్యాయం జరిగినట్లు తెలిస్తే ఆయన దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఆర్డీవో మాట్లాడుతూ.. మొండిగౌరెల్లిలోని 677 ఎకరాల్లో 433 ఎకరాలు క్లియర్‌గా ఉందని, మరో 177 ఎకరాల భూమిలో కుటుంబ వివాదాలు, ఇతరత్రా అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. వాటిని పరిష్కరించి విడతల వారీగా బాధిత రైతులకు చెక్కుల పంపిణీ చేపడతామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అయ్యప్ప, డీటీ కీర్తిసాగర్, సర్పంచ్ రమాదేవి, ఇబ్రహీంపట్నం, యాచారం ఎస్‌హెచ్‌ఓలు మహేందర్‌రెడ్డి, నందీశ్వర్ పాల్గొన్నారు.


