ఓటు నమోదుకు ని‘బంధనాలు’ | - | Sakshi
Sakshi News home page

ఓటు నమోదుకు ని‘బంధనాలు’

Oct 29 2026 8:24 AM | Updated on Oct 29 2026 8:24 AM

● చౌడాపూర్‌లో పట్టభద్రులకు

తప్పని తిప్పలు

● గెజిటెట్‌ అధికారుల సంతకాలు,

ఒరిజినల్‌ మెమోలు కావాలంటూ కొర్రీలు

కుల్కచర్ల: రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చౌడాపూర్‌ మండలంలో ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో మాత్రమే ఓటరు దరఖాస్తులకు ఆమోదం లభించింది. ఇందుకు నిబంధనలే కారణమని తెలుస్తోంది. కొత్తగా డిగ్రీ పూర్తి చేసుకున్న వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే కొత్త ఓటర్ల నమోదుకు గెజిటెట్‌ అధికారుల సంతకాలు, ఒరిజినల్‌ మెమోలు కావాలంటూ మండల రెవెన్యూ అధికారులు చెబుతున్నట్లు తెలిసింది. వాటిని తహసీల్దార్‌ కార్యాలయంలో చూపించాలని చెబుతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

ఇబ్బంది పడుతున్నాం

పట్టభద్రుల ఓటరు నమోదుకు గెజిటెడ్‌ అధికారి సంతకం అవసరమని రెవెన్యూ అధికారులు చెప్పడం ఇబ్బందిగా మారింది. చౌడాపూర్‌ మండలంలో ఒకరిద్దరు మాత్రమే గెజిటెడ్‌ అధికారులు ఉన్నారు. ఉపాధ్యాయులు సంతకాలు పెట్టేందుకు నిరాకరిస్తున్నారు. అధికారులు వాస్తవ పరిస్థితులను గ్రహించి గ్రామస్థాయిలో బీఎల్‌ఓలతో పర్యవేక్షణ చేసి ఓటరుగా నిర్దారించే ప్రక్రియను చేపట్టాలి.

– విజయకుమార్‌, చాకల్‌పల్లి

నిబంధనల ప్రకారమే

ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారమే ప్రతి ఓటరు ఒరిజినల్‌ మెమోలు, జిరాక్స్‌ కాపీలపై గెజిటెడ్‌ అధికారుల సంతకాలు కోరుతున్నాం. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. వారు సూచనల మేరకు ఓటర్ల నిర్దారణ ప్రక్రియ నిర్వహిస్తాం.

– వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌,

చౌడాపూర్‌ మండలం

ఓటుహక్కు ఇవ్వరట

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి కల్మన్‌కాల్వ గ్రామ యువకుడు మడుగు శివకుమార్‌. ఉద్యోగ అన్వేషణలో భాగంగా హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. పట్టభద్రుల ఓటుహక్కు నమోదులో భాగంగా తన భార్యతో కలిసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు ఫోన్‌లో భార్య వివరాలు తెలుసుకుని నిర్దారణ చేయగా.. నివాస ధ్రువ పత్రాలలో ఏదైనా ఒకటి జిరాక్స్‌, మెమో జిరాక్స్‌ తీసుకుని వాటిపై గెజిటెడ్‌ అధికారి సంతకాలు చేయించి తమకు ఇవ్వాలని శివకుమార్‌కు చెప్పడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement