వికారాబాద్: దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో ఆర్‌టీసీకి రెండింతల ఆదాయం సమకూరింది. మహిళలకు ఉచిత ప్రయాణంతో సర్వీసులు కిటకిట లాడుతుండగా పండుగలకు మరింత రద్దీ పెరిగింది. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రద్దీని ముందుగానే అంచనా వేసిన ఆర్‌టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపారు. పాఠశాలలు, కళాశాలలకు వారం నుంచి పది రోజుల పాటు సెలవులు ఉండటంతో సొంత ఊర్లకు వెళ్లారు.
రోజూ సగటున లక్ష మంది ప్రయాణం
జిల్లాలో వికారాబాద్, తాండూరు, పరిగిలో డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 200 పైచిలుకు బస్సులు నడుస్తున్నాయి. మూడు డిపోల ద్వారా రోజుకు సగటున లక్ష మంది ప్రయాణికులు వారి గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. వికారాబాద్ డిపో పరిధిలో సాధారణ రోజుల్లో 15వేల నుంచి 20వేల మంది వరకు మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. పండుగ కావడంతో గడిచిన వారం రోజుల్లో సగటున 60 వేల నుంచి 70వేల మంది ప్రయాణించారు. సాధారణ రోజుల్లో సంస్థకు రోజుకు సగటున రూ.4 లక్షల మేర ఆదాయం వచ్చేది. గడిచిన రెండు రోజుల్లో నిత్యం రూ.7 లక్షల నుంచి రూ.11 లక్షల చొప్పున ఆదాయం సమకూరింది. తాండూరు డిపోలో సాధారణ రోజుల్లో రోజుకు సగటున రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల ఆదాయం వచ్చేది. పండుగ సందర్భంగా రోజుకు రూ.20 లక్షలు దాటి ఆదాయం వచ్చింది. పరిగి డిపోలో రోజుకు సగటున రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షల ఆదాయం వచ్చేది.. పండుగల నేపథ్యంలో రోజుకు రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది.
ప్రైవేటు బాదుడు
పండుగ రద్దీ విపరీతంగా పెరగడంతో ప్రైవేటు వాహనదారులు టెకెట్ల రేట్లను భారీగా పెంచేశారు. కొన్ని రూట్లలో సాధారణ రోజులతో పోలిస్తే రెండింతలు వసూలు చేశారు. చాలా మంది విధిలేక ప్రైవేటు వాహనాలను అద్దెకు మాట్లాడుకుని సొంత ఊర్లకు వెళ్లారు.
వికారాబాద్ బస్టాండులో ప్రయాణికుల రద్దీ
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఆర్‌టీసీకి ఫుల్ గిరాకీ
సమకూరిన రెండింతల ఆదాయం
భారీగా ప్రైవేటు బాదుడు


