కొడంగల్: పేదల పక్షాన పోరాటం చేసి అమరుడైన పండుగ సాయన్న జయంతిని గురువారం పట్టణంలోని కడా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు దీపక్ తివారి, ప్రియాంకలు సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాం ప్రభుత్వ హయాంలో భూస్వాములు, పెత్తందారుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడని కొనియాడారు. పేదలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. పండుగ సాయన్న పోరాట స్ఫూర్తి, సామాజిక స్పృహ నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఉమాశంకర ప్రసాద్, వెంకటాచారి, ఆర్‌డీఓ అనిత, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి మాధవరెడ్డి, తహసీల్దార్ రాంబాబు, మిషన్ భగీరథ డీఈ శశాంక్, ఎంపీడీఓ ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు.
పోరాట యోధుడు సాయన్న: ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: నిజాం నిరంకుశ పాలనకు, భూస్వాములు, జమిందార్ల దౌర్జనాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహోన్నత వ్యకి పండుగ సాయన్న అని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం సాయన్న జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. ఎన్నికల సమయంలో ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి నెరవేరుస్తున్నారని తెలిపారు. గత పాలకులు సాయన్నను విస్మరించారని ఆరోపించారు. ముదిరాజ్‌ల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సాయన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రజిత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రాములు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
వికారాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు దీపక్ తివారి, ప్రియాంక


