పాల్గొన్న ఎస్పీ స్నేహమెహ్ర
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఆదివారం ఎస్పీ స్నేహమెహ్ర ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. బెల్ ఆఫ్ ఆర్మ్‌లో భద్రపరిచిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పోలీసు వాహనాలకు పూజలు చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాజేష్ మీనా, ఏఆర్ డీఎస్పీ వీరేష్, ఆర్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆర్యసమాజ్ భవనంలో..
తాండూరు: పట్టణంలోని ఆర్యసమాజ్ భవనంలో ఆదివారం దుర్గాష్టమి పూజ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆయుధ పూజలో సమాజ్ ప్రతినిధులతో పాటు బిజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్, నాయకులు కృష్ణముదిరాజ్, భద్రేశ్వర్, శ్రీకాంత్, కృష్ణ, సమాజం ప్రతినిధులు శివప్రకాష్, మోహన్‌రావు, కమలాకర్, శివాజి, నరేందర్, బస్వలింగప్ప, గోపాల్ సంతోష్ పాల్గొన్నారు.
చేవెళ్ల: పండుగల సాయన్న జయంతి వేడుకలను ఈనెల 22న ఘనంగా నిర్వహించుకోవాలని ముదిరాజ్ కార్పారేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్‌ముదిరాజ్ పిలుపునిచ్చారు. చేవెళ్లలో ఆదివారం ఆయన ముదిరాజ్ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పండుగల సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ముదిరాజ్‌ల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు తలారి మల్లేశ్, మండల అధ్యక్షుడు నర్సింలు, యువజన సంఘం అధ్యక్షుడు తెలుగు శ్రీనివాస్, ఊరడి నర్సింలు, రాంప్రసాద్, గోపాల్, శంకర్‌పల్లి అధ్యక్షుడు మైసయ్య, షాబాద్ అధ్యక్షుడు గోపాల వెంకటేశ్, జనార్దన్ పాల్గొన్నారు.
మంచాల: పండుగ పేరుతో రాష్ట్రపక్షి పాలపిట్టను బంధించి హింసిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ చంద్రశేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం సీఐ మధు ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దసరా పండుగ రోజు పాలపిట్టను చూడాలని పట్టుకోవాలని ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. కొంతమంది ప్రజల సందర్శనార్థం పట్టుకొచ్చి గ్రామాల్లో ప్రదర్శిస్తారని, ఇలాంటివి చేయకూడదన్నారు. వన్యప్రాణి చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది జంగారావు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
షాబాద్: కుటుంబపరమైన సమస్యల కారణంగా ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ డీకే లక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామానికి చెందిన గడ్డంగుల ముర్గేశ్ (32) షాబాద్‌లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబపరమైన సమస్యల కారణంగా ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


