జిల్లాలో పట్టభద్రుల ఓట్ల దరఖాస్తులు
వికారాబాద్: జిల్లాలోని పట్టభద్రులు ఓటు హక్కు నమోదు కోసం ముందుకు రావడం లేదు. దీంతో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. చివరగా 2021 మార్చిలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించగా, బీఆర్ఎస్ అభ్యర్థి వాణి సురభిదేవి విజయం సాధించిన విషయం తెలిసిందే. త్వరలో ఆమె పదవీ కాలం ముగియనుండటంతో ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇందులో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని తొమ్మిది జిల్లాల ఓటర్లు పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.జనరల్ ఓటు ఒక్కసారి నమోదు చేసుకుంటే శాశ్వతంగా ఉండేది. నియోజకవర్గ మార్పు, కరెక్షన్ తదితర అంశాలు ఏవైనా ఉంటే మార్పులు చేసుకునే వీలుండేది. కానీ ఈసారి ఎన్నికల సంఘం కొత్త నిబంధన తీసుకువచ్చింది. గతంలో నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్ ఓటర్లు సైతం ఇప్పుడు కొత్త ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. దీంతో గతంలో ఓటరుగా నమోదు చేసుకున్నా సరే తాజాగా నమోదు చేసుకోవాల్సి వస్తోంది. ఓటరు నమోదు కార్యాక్రమాన్ని ప్రారంభించిన ఎన్నికల సంఘం ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా కూడా దరఖాస్తుకు వీలు కల్పించింది. కానీ, ఈప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
నలభైశాతం లోపే
ఓటరు నమోదు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. గత 2021 ఎన్నికల సమయంలో మొత్తం పట్టభద్రుల ఓటర్లు ఆరు లక్షల మంది ఉండగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 60 వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో 25,544 మంది నమోదై ఉన్నారు. వీరందరూ ఓటరుగా మళ్లీ నమోదు చేసుకోవటంతో పాటు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు కూడా నమోదు చేసుకోవాలి. ఈసారి ఓటర్లు మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో ఏటా సుమారు ఆరు వేల మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2021 ఓటరు జాబితాతో పోలిస్తే ఓటర్లు రెండింతలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 28 నుంచి కేంద్రం ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. నవంబర్ 6 వరకు ఇది కొనసాగుతుంది. నవంబర్ 25న ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ ప్రకటించనుంది. డిసెంబర్ 30న తుది జాబితా ప్రకటిస్తారు. ఓటరు నమోదు ప్రారంభమై 19 రోజులు కాగా నమోదుకు మరో 19 రోజుల గడువు ఉంది. అయితే నమోదు కావాల్సిన ఓటర్లలో ఇప్పటి వరకు 30 శాతం మందే ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 13,344 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవటం గమనార్హం. వీరిలో ఎక్కువ శాతం మంది ఆన్లైన్ విధానాన్నే వినియోగించారు. మొత్తం అప్లికేషన్లలో కేవలం 27 మంది మాత్రమే ఆఫ్లైన్లో అప్లయ్ చేసుకున్నారు.
పట్టించుకోని పార్టీలు
పట్టభద్రుల ఓటరు నమోదుకు అధికారులు శ్రమిస్తున్నారు. అయితే, ప్రతీ విషయంలో హంగామా చేసే రాజకీయ పార్టీలు పెద్దగా స్పందించడం లేదు. కీలకమైన హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును కై వసం చేసుకునేందుకు పావులు కదుపుతున్న పార్టీలు ఓటరు నమోదును పట్టించుకున్న దాఖలాలు లేవు. విజ్ఞులైన పట్టభద్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం పెద్దగా లేకపోయినా.. పార్టీల స్పందన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
నత్తనడకన గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు
జిల్లాలో నలభైశాతం కూడా నమెదు కాని వైనం
చివరి తేదీ నవంబర్ 6
ఇప్పటి వరకు ఆన్లైన్లో నమోదు చేసుకున్న ఓటర్లు: 13,344
2021 ఎన్నికల సమయంలో జిల్లాలో పట్టభద్రుల ఓట్లు: 25,544
మండలం దరఖాస్తులు
వికారాబాద్ 1,907
తాండూరు 1,804
పరిగి 1,276
కుల్కచర్ల 764
యాలాల 680
కొడంగల్ 652
దోమ 604
పూడూరు 597
నవాబుపేట్ 591
ధారూరు 570
పెద్దేముల్ 522
దౌల్తాబాద్ 491
మోమిన్పేట 465
బషీరాబాద్ 413
బొంరాస్పేట్ 383
మర్పల్లి 375
చౌడాపూర్ 350
దుద్యాల 327
కోట్పల్లి 306
బంట్వారం 264


