● ఎస్పీ స్నేహ మెహ్ర
● పోలీసు అధికారులతో సమీక్ష
అనంతగిరి: బతుకమ్మ, దసరా వేడుకలు, దుర్గామాత నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా పూర్తయ్యేలా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఎస్పీ స్నేహ మెహ్ర పోలీసు అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై శనివారం పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 407 దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించిన నేపథ్యంలో నిమజ్జన ఊరేగింపు ప్రశాంతంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నిమజ్జన సమయంలో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఉత్సవ నిర్వాహకులు విధిగా పోలీసుల సూచనలు పాటించాలని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించే రావణ దహన కార్యక్రమాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున జన సమూహాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల భద్రతకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, డీఎస్పీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.


