బుద్వేల్‌ టు నాచారం | - | Sakshi
Sakshi News home page

బుద్వేల్‌ టు నాచారం

Sep 9 2026 11:57 AM | Updated on Sep 9 2026 11:57 AM

రూ..5,060 కోట్లతో పనులు

రేడియల్‌– 2 రోడ్డు నిర్మాణానికి కార్యాచరణ

ఔటర్‌ నుంచి పారిశ్రామిక ప్రాంతాలకు కనెక్టివిటీ

మూడు దశల్లో నిర్మాణానికి హెచ్‌జీసీఎల్‌ టెండర్లు

టెక్నికల్‌ బిడ్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డు– 2 నిర్మాణానికి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కార్యాచరణ చేపట్టింది. ఓఆర్‌ఆర్‌ నుంచి ట్రిపుల్‌ ఆర్‌ వరకు వివిధ ప్రాంతాల్లో రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా రావిర్యాల నుంచి ఫ్యూచర్‌సిటీ మీదుగా ట్రిపుల్‌ ఆర్‌ సమీపంలోని ఆమనగల్లు వరకు ఒకటో రేడియల్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. బుద్వేల్‌ నుంచి ఎన్‌హెచ్‌–167 (ఎన్‌) సమీపంలోని నాచారం వరకు 81.15 కి. మీ మేర రెండో రోడ్డు నిర్మాణానికి హెచ్‌ఎండీఏ అనుబంధ సంస్థ హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) తాజాగా నోటిఫికేషన్‌ వెల్లడించింది. నిర్మాణ సంస్థల నుంచి టెక్నికల్‌ బిడ్‌లను ఆహ్వానించింది. ఈ నెల 30 వరకు దరఖాస్తులను అందజేయాలని పేర్కొంది.

మొత్తం 81.15 కి.మీ..

ఓఆర్‌ఆర్‌ నుంచి రీజినల్‌ రింగ్‌రోడ్డు వెలుపలి పారిశ్రామిక ప్రాంతాలకు ఈ రేడియల్‌ రోడ్డు కనెక్టివిటీ సదుపాయాన్ని ఇవ్వనుంది. ఓఆర్‌ఆర్‌ నుంచి ట్రిపుల్‌ ఆర్‌ సమీపంలోని తుర్క ఎంకపల్లి వరకు.. అక్కడి నుంచి ఎన్‌హెచ్‌ 67 (ఎన్‌) వరకు ఈ రోడ్డును పొడిగించనున్నారు. మొత్తం నాలుగు వరుసల్లో నిర్మించనున్న రేడియల్‌ రోడ్డు– 2ను మూడు దశల్లో పూర్తి చేయనున్నట్లు హెచ్‌జీసీఎల్‌ అధికారులు తెలిపారు. మొదటి దశలో బుద్వేల్‌ నుంచి షాబాద్‌ వరకు 29.50 కి.మీ, రెండో దశలో షాబాద్‌ నుంచి గూడూర్‌ వరకు 27, మూడో దశలో గూడూర్‌ నుంచి నాచారం వరకు 24.65 చొప్పున మొత్తం 81.15 కి.మీ మేర పూర్తి చేయనున్నారు.

ఈ రేడియల్‌ –2 రోడ్డు నిర్మాణానికి రూ.5,060 కోట్లతో అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులను అందజేసింది. ఈ ప్రాజెక్టు కోసం రంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణ్‌పేట్‌ జిల్లాల్లోని 41 గ్రామాల పరిధిలో 1,486.30 ఎకరాలను సేకరించనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 21 గ్రామాల్లో 831.36 ఎకరాలు (44.70 కి.మీ.), వికారాబాద్‌లోని 18 గ్రామాల్లో 558.18 ఎకరాలు (31.50 కి.మీ.), నారాయణ్‌పేట్‌ జిల్లాలోని 2 గ్రామాల్లో 96.16 ఎకరాల (5.05 కి.మీ.) భూముల సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 902.16 ఎకరాల భూసేకరణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కాగా.. భూసేకరణకు ప్రభుత్వం రూ.3,800 కోట్లు కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement