అస్తిత్వం కోల్పోతాం.. డంప్‌యార్డు వద్దు | - | Sakshi
Sakshi News home page

అస్తిత్వం కోల్పోతాం.. డంప్‌యార్డు వద్దు

Jul 23 2026 6:54 AM | Updated on Jul 23 2026 6:54 AM

కొత్తూరు: సిద్ధాపూర్‌లో డంప్‌యార్డు ఏర్పాటు చేస్తే ఆస్తులు, అస్తిత్వంతో పాటు సర్వస్వం కోల్పోతామని బాధితులు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం డంప్‌యార్డుతో కలిగే అనర్థాలపై జేఏసీ నేతలు కలెక్టర్‌ కార్యాలయంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు. ధర్నా విరమణ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కలెక్టర్‌ సుమారు గంట పాటు చర్చించారు. డంప్‌యార్డు ప్రతిపాదిత స్థలం రైలు, రోడ్డు, విమానాశ్రయాలకు సమీపంలో ఉందన్నారు. ఎన్నో బహుళజాతి పరిశ్రమలు, పవిత్రమైన జేపీదర్గా, అనంతపద్మనాభస్వామి ఆలయం, గురుకుల పాఠశాల కొనసాగుతున్నాయని వివరించారు. సీఎం మానసపుత్రిక అయిన ఫ్యూచర్‌సిటీ అతి సమీపంలో ఉందన్నారు. జనాభా, అభివృద్ధి పరంగా దూసుకెళ్తున్న ప్రాంతంలో డంప్‌యార్డు ఏర్పాటు చేస్తే వీటి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. అనంతరం కలెక్టర్‌ స్పందిస్తూ.. బాధితులు పేర్కొన్న అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్యాంసుందర్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్‌, శేఖర్‌రెడ్డి, సుదర్శన్‌గౌడ్‌, రవికుమార్‌గుప్తా, జంగయ్య, బాల్‌రాజు, శంకర్‌నాయక్‌, సర్పంచులు బాసునాయక్‌, గోవింద్‌నాయక్‌, ఎర్రొళ్ల జగన్‌, సుమిత్రమల్లారెడ్డి, విష్ణుశాంతినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

వినతి పత్రంలోని ప్రధాన అంశాలు

● స్టోన్‌క్రషర్‌ బ్లాస్టింగ్‌లతో ప్రకంపనలకు భూమి పొరలు వదులుగా ఉన్నాయి. డంప్‌యార్డు ఏర్పాటు చేస్తే వాటి వ్యర్థాలు భూపొరల్లోకి సులువుగా ఇంకి భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి.

● హైదరాబాద్‌ జంట జలాశయాలకు ఈ ప్రాంతం నుంచి నీటి ప్రవాహం ఉండటంతో నీటి కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందన్నారు.

● జాతీయ రహదారిపై ఇప్పటికే ట్రాఫిక్‌ రద్దీ ఉన్న నేపథ్యంలో చెత్త వాహనాల రాకపోకలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయని తెలిపారు.

● డంప్‌యార్డు నిర్వహణలో లోపాలు ఉంటే ఈగలు, దోమలు, ఇతర కీటకాలు పెరిగి ప్రజారోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

● ముఖ్యంగా విమానాశ్రయం దగ్గరగా ఉండడంతో విమానాలు కింది నుంచి వెళ్లే క్రమంలో గద్దలు, ఇతర పక్షులు ఢీకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

● ఇక్కడ కొనసాగుతున్న పీఅండ్‌జీ, నాట్కో, మైక్రోసాఫ్ట్‌ ఇతర పరిశ్రమలపై ప్రతికూల పరిస్థితులు ఉంటాయన్నారు.

రంగారెడ్డి కలెక్టర్‌ నారాయణరెడ్డికి విన్నవించిన సిద్ధాపూర్‌ బాధితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement