● నలుగురు విద్యార్థులకు గాయాలు
● ఇద్దరిని తాండూరు ఆస్పత్రికి తరలింపు
బొంరాస్‌పేట: స్కూల్ వ్యాన్‌ను ఇసుక ట్రాక్టర్ ఢీ కొనడంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం మండలంలోని మహంతీపూర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన 11 మంది విద్యార్థులు కొడంగల్‌లోని శ్రీ గాయత్రి పాఠశాలలో చదువుతున్నారు. ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు సాయంత్రం వ్యాన్‌లో ఊరికి బయలుదేరారు. ఈ క్రమంలో మహంతీపూర్ చెందిన అచ్చమోళ్ల రాములు గ్రామ సమీపంలోని వాగు నుంచి ట్రాక్టర్‌లో ఇసుక తరలిస్తున్నారు. కొత్తూరు శివారులో డంపు చేసేందుకు వెళ్తుండగా మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు వద్ద ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో వ్యానులోని చందన(నాలుగో తరగతి) తలకు, యశశ్విని(మూడో తరగతి) కాలికి, మోక్ష(ఆరో తరగతి), నికిల్ (రెండో తరగతి)కు గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం మోక్ష, నికిల్‌ను తాండూరులోని ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్‌ను పోలీసు స్టేషనుకు తరలించారు.


