అందని యూనిఫాం | - | Sakshi
Sakshi News home page

అందని యూనిఫాం

Jul 23 2026 6:54 AM | Updated on Jul 23 2026 6:54 AM

పరిగి: పాఠశాలలు పునఃప్రారంభమై నెల రోజులు కావస్తున్నా విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందలేదు. గత ఏడాది పంపిణీ చేసిన వాటితోనే స్కూళ్లకు వస్తున్నారు. ఎప్పటిలాగే ఈ సారి కూడా ప్రభుత్వం దుస్తులు కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించింది. కానీ క్లాత్‌ సరఫరా చేయలేదు. ఈ కారణంగానే ఆలస్యం అవుతున్నట్లు తెలిసింది. జిల్లాలో మొత్తం 1,037 ప్రభుత్వ పాఠశాలలు.. 1,41,319 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున 2,82,638 యూనిఫారాలు అందించాల్సి ఉంది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి యూనిఫాం రంగు, డిజైన్‌లో మార్పులు చేశారు. బాలికలకు లాంగ్‌ ఫ్రాక్‌, షర్ట్‌, స్కర్ట్‌, బాలురకు నీలం రంగు చొక్కా.. లేత నీలం రంగు నిక్కర్‌, లేదా ఫ్యాంటు తరగతుల వారీగా అందించనున్నారు. ఇందుకు సంబంధించిన క్లాత్‌ సరఫరా కాకపోవడంతో విద్యార్థులకు ఎప్పుడు అందుతాయి అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.

పాత వాటితో ఇబ్బంది

ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ శాతం మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఉంటారు. గత ఏడాది పంపిణీ చేసిన యూనిఫారాలు చాలా వరకు చిరిగిపోయాయి. వాటినే వేసు కొని స్కూళ్లకు వస్తున్నారు. మరి కొందరు సాధా రణ దుస్తులతో వస్తున్నారు. యూనిఫారాల విషయంలో విద్యాశాఖ అలసత్వం వహిస్తోందనే విమ ర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే సరఫరా చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

మరింత ఆలస్యం కావొచ్చు..

ఏకరూప దుస్తులకు సంబంధించి ఇప్పటి వరకు వస్త్రమే జిల్లాకు చేరలేదు. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల కొలతలు తీసుకుని దుస్తులు కుట్టడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుంది. పంద్రాగస్టు నాటికై నా కొత్త యూనిఫాం అందుతుందా లేదా అనే అనుమానం విద్యార్థుల్లో ఉంది. గత ఏడాది కూడా దుస్తుల కొలతల్లో తేడాలు వచ్చాయి. కొందరు విద్యార్థులకు చిన్నగా, మరి కొందరికి పెద్దవి పంపిణీ చేశారు. దీంతో వాటిని వేసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. చేసేదేమీ లేక సరిపెట్టుకున్నారు. ఈ సారైనా సరైన కొలతలు తీసుకొని యూనిఫాం కుట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

నెలరోజులవుతున్నా విద్యార్థులకు చేరని దుస్తులు

పాత వాటితోనే సరిపెట్టుకుంటున్న చిన్నారులు

పంద్రాగస్టుకై నా అందేనా?

జిల్లాలో మొత్తం పాఠశాలలు 1,037

విద్యార్థుల సంఖ్య 1,41,319.

ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున..

కావాల్సిన దుస్తులు 2,82,638

రెండ్రోజుల్లో వస్త్రం వస్తుంది

రెండు రోజుల్లో యూనిఫాంకు సంబంధించిన వస్త్రం వస్తుంది. కుట్టేందుకు మహిళా సంఘాలు సిద్ధంగా ఉన్నారు. వీలైనంత త్వరగా విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకుంటాం.

– అంజయ్య, ఎంఈఓ, పరిగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement