లైన్ అంచనాలు, కొత్త కనెక్షన్లఅర్జీలు పెండింగ్‌లో ఉండొద్దు అంగన్‌వాడీల నుంచి బకాయిలు వసూలు చేయాలి టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ మింట్ కాంపౌండ్ నుంచి ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ఉద్దేశ పూర్వకంగా అర్జీలను తొక్కిపెట్టే ఇంజనీర్లపై వేటు తప్పదని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సీఎండీ జితేష్ వి పాటిల్ హెచ్చరించారు. వినియోగదారుల నుంచి అందిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని, ప్రతీ ఇంజనీరు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ఈ మేరకు బుధవారం మింట్‌కాంపౌండ్ కార్పొరేట్ ఆఫీసు నుంచి 21 సర్కిళ్ల పరిధిలోని ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సరఫరా, బిల్లింగ్, నెట్‌వర్క్ బలోపేతం, భద్రతా చర్యలు, పెండింగ్ పనులు, కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ, కొత్త లైన్ల ఏర్పాటుకు అంచనాల తయారీలో జాప్యం, నెట్‌వర్క్ మ్యాపింగ్, మోడల్ సబ్‌స్టేషన్లు తదితర అంశాలపై సమీక్షించారు. అంగన్‌వాడీలు, ఇతర సంస్థల నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే వసూలు చేయాలన్నారు. 33కేవీ, 11 కేవీ లైన్లు, డీటీఆర్‌లు, స్ట్రక్చర్ కోడ్ మ్యాపింగ్ పనులు పూర్తి చేయాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న వాణిజ్య కేటగిరీలకు వెంటనే కనెక్షన్లు జారీ చేయాలని, కొత్త విద్యుత్ కనెక్షన్లు, అంచనాలు, వర్క్ ఆర్డర్లు, సాంకేతిక అనుమతులు, పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. బకాయిల వసూళ్లతో పాటు విద్యుత్ చోరీ, అనధికార కనెక్షన్లు, నిబంధనలకు విరుద్ధంగా బహుళ మీటర్ల వినియోగాన్ని గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. సోలార్ కనెక్షన్ల నమోదులో క్షేత్రస్థాయిలో పూర్తి సహకారం అందించి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మోడల్ సబ్‌స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాన్ని అన్ని జిల్లాలకు విస్తరించి, అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలన్నారు. ప్రతీ పనికి స్పష్టమైన లక్ష్యాలు, గడువు నిర్ణయించి అమలు చేయాలని, ఆగస్టు 10న జరిగే సమీక్ష నాటికి అన్ని పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు శివాజీ, పి.కృష్ణారెడ్డి, ఎన్.నరసింహులు, చక్రపాణి, సీఈలు, సీజీఎంలు ఉన్నారు.


