అక్కడికక్కడే ఆటో డ్రైవర్ మృతి
మొయినాబాద్: ఆటో నడుపుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ డ్రైవర్‌ను రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ కబళించింది. అతివేగంతో వచ్చిన టిప్పర్ ఆటోను ఢీకొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తాజ్ హోటల్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం హాజీపూర్‌కు చెందిన ఆకుల రుక్మొద్దీన్(51) కుటుంబ సభ్యులతో కలిసి పదిహేను ఏళ్ల క్రితం మొయినాబాద్‌కు వలస వచ్చారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మంగళవారం ఉదయం అజీజ్‌నగర్ నుంచి తోలుకట్ట వైపు పీవీసీ ప్యానెల్ సామగ్రిని ఆటోలో తీసుకెళ్లారు. ఖాళీ చేసి మధ్యాహ్నం తిరిగి మొయినాబాద్‌కు వస్తుండగా తాజ్ హోటల్ వద్దకు రాగానే అతివేగంతో రాంగ్‌రూట్లో వచ్చిన టిప్పర్ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీ కొట్టి, ఆయనకి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


