● నాణ్యతలేని మధ్యాహ్న భోజనం
● అల్పాహారంలో కోత
బషీరాబాద్: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించింది. మాడిన అన్నం చక్కలు, నీళ్లచారుతో మమ అనిపిస్తున్నారని చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనం బషీరాబాద్ మండల పరిధి జీవన్గీ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చిన్నారులకు వడ్డించిన భోజనమే. పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 100 మంది విద్యార్థులు చదువుతుండగా, నలుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, సాంబారు, పాలు ఇవ్వాల్సి ఉండగా.. పిల్లలకు టిఫిన్‌లో కోత విధించి, నిర్వాహకులు ఇడ్లీ, పాలు మిగుల్చుకున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. అధికారుల పర్యవేక్షణ లోపం వలనే ఇలా జరిగిందని విమర్శించారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


