
చంపినా ఇంతేనా?
ధారూరు: పేదలను చంపినా పట్టించుకోరా..? ఎమ్మెల్యేలు, నాయకులు ఫోన్లు చేస్తే హత్యలకు పాల్పడే వారిని కూడా వదిలేస్తారా..? పది మంది యువకులు మద్యం, గంజాయి మత్తులో గొడ్డలితో పాటు ఇతర మారణాయుధాలతో దాడి చేసినా.. రాజకీయాలకు ఒత్తిడికి తలొగ్గి వాస్తవాలను దాచిపెట్టి, పెట్టీ కేసులు పెట్టి వదిలేస్తారా అంటూ బాధిత భార్యాభర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. సామాన్యులకు జరిగే న్యాయం ఇదేనా.. అని పోలీసులను నిలదీశారు. నాగారంలో హోటల్ నిర్వహిస్తూ బతుకీడుతున్న తమపై బుధవారం రాత్రి కారులో వచ్చిన పది మంది యువకులు దాడి చేశారన్నారు. నూడుల్స్‌లో నూనె తక్కువగా వేశారంటూ మారణాయుధాలతో గాయపర్చారని, అడ్డువచ్చిన మరో ఇద్దరిని సైతం దారుణంగా కొట్టారని బాధిత దంపతులు నీరటి భారతమ్మ, అంజి గురువారం ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన యాలాల మండల రాస్నం యువకులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. లేదంటే తాము ఉన్నతాధికారులతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. తమతో తెల్ల కాగితంపై సంతకాలు తీసుకున్న పోలీసులు కేసును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దాడికి పాల్పడిన పది మందిలో కేవలం ముగ్గురిని మాత్రమే పట్టుకుని మిగిలిన వారిని వదిలేశారని ఆరోపించారు. తామకు న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే
హంతకులనూ వదిలేస్తారా..
ధారూరు పోలీసుల తీరుపై
బాధితుల మండిపాటు
పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన
ఉన్నతాధికారులు, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆవేదన