
కంపించిన భూమి
పరిగి: మండలంలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున 3.55గంటలకు బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యాయత్‌నగర్, హనుమాన్‌గండి గ్రామాల్లో 3 నుంచి 4 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. ఇళ్లలోని సామగ్రి కింద పడటంతో ప్రజలు బయటికి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. గతంలో ఒకసారి బసిరెడ్డిపల్లిలో భూమి కంపించిన విషయం తెలిసిందే.
ధైర్యంగా ఉండాలి: కలెక్టర్
విషయం తెలుసుకున్న కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఎస్పీ నారాయణరెడ్డితో కలిసి గురువారం బసిరెడ్డిపల్లి, రంగాపూర్ గ్రామాలను సందర్శించారు. భూమి కంపించడంపై ఆరా తీశారు. ఇళ్లకు పగుళ్లు వచ్చి ఉంటే ఆ సమాచారం సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు పొలాలకు వెళ్లరాదని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
పూడూరు మండలంలో..
పూడూరు: మండలంలోని కెరవెళ్లి, దేవనోనిగు, సిరిగాయపల్లి, సోమన్‌గుర్తి గ్రామాల్లో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ పాండు దేవనోనిగుడ గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీఓ సుందర్, గ్రామస్తులు నారాయణ, పెద్ద నారాయణ తదితరులు పాల్గొన్నారు.
3 నుంచి 4 సెకండ్ల పాటు ప్రకంపనలు
ఇళ్లలోంచి పరుగులు తీసిన జనం
గ్రామాలను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ