
గెస్ట్ అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతగిరి: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకుల నియామకానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియెట్ అధి కారి శంకర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తాండూర్‌లో ఉర్దూ మీడియంలో ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ (ఒకేషనల్,) పెద్దేముల్‌లో కెమిస్ట్రీ (తెలుగు మీడియం)పోస్టులకు దరఖా స్తు చేసుకోవాలన్నారు. అర్హత గల్గిన అభ్యర్థులు ఈనెల 5 నుంచి 7 వరకు వికారాబాద్‌లోని జిల్లా ఇంటర్మీడియెట్ కార్యాలయం(జెడ్పీహెచ్‌ఎస్ బాలుర, అనంతగిరిరోడ్డు ఆవరణలోని) ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు సమర్పించాలన్నారు.
రేపు తాండూరులో
మంత్రుల పర్యటన
● ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
● ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
తాండూరు: అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్‌తో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం తాండూరులో పర్యటిస్తారని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు, ఈఎన్‌సీ మోహన్‌నాయక్, ఎస్‌సీ వసంత్‌కుమార్, ఈఈ శ్రీధర్‌బాబుతో పాటు తాండూరు డివిజన్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రుల పర్యటన సజావుగా సాగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తాండూరు, బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు చిలుక వాగు ప్రక్షాళన పనులు, తాండూరులోని విలియంమూన్ సర్కిల్ నుంచి పెద్దేముల్ మార్గంలోని బైపాస్ రోడ్డువరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డి తదితరు పాల్గొన్నారు.
త్వరలోనే లబ్ధిదారులకు ఇళ్లు
పట్టణ శివారులో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు పూర్తయ్యాయి. నిర్మాణ దశలో ఉన్నవి ఎన్ని అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా వదిలేసిన నిర్మాణాలను పూర్తి చేసి త్వరలోనే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని తెలిపారు.
విద్యుదాఘాతంతో
ట్రాన్స్‌కో కార్మికుడి మృతి
కొత్తూరు: విద్యుదాఘాతంతో ట్రాన్స్‌కో కార్మికుడు మృతి చెందిన సంఘటన మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కొడిచర్లకు చెందిన బాలుచారి(35) కొన్నేళ్లుగా ట్రాన్స్‌కోలో ఆర్టిజన్ (హెల్పర్)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం సిద్ధాపూర్ శివారులో 11కేవీ స్తంభం వద్ద జంపర్ తెగిపోయింది. సమాచారం రావడంతో బాలుచారి అక్కడికి చేరుకుని మరమ్మతులు చేసేందుకు స్తంభం పైకి ఎక్కాడు. మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం మహేశ్వరం మండలం మన్సాన్‌పల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం ట్రాన్స్‌కో సిబ్బంది సమన్వయ లోపమా..? స్తంభం ఎక్కి మరమ్మతులు చేయడానికి ముందు బాలుచారి విద్యుత్ సరఫరా నిలిపివేయాలని (ఎల్‌సీ) అనుమ తులు తీసుకున్నాడా..? లేదా..? అనే విషయా లు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై ఏఈ సాయికృష్ణను వివరణ కోరగా మరమ్మతులకు ముందు బాలుచారి అనుమతులు తీసుకోనట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. మృతుడికి భార్యతో పాటు మూడేళ్ల కూతురు ఉంది.
ఏఐఎస్‌ఎఫ్ జిల్లా
అధ్యక్షుడిగా పవన్ చౌహాన్
షాద్‌నగర్: ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా షాద్‌నగర్ పట్టణానికి చెందిన పవన్ చౌహాన్ ఎన్నికయ్యారు. రాజేంద్రనగర్‌లోని ఏఆర్ దేవరాజ్ భవన్‌లో శనివారం సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడిగా పవన్ చౌహాన్, జిల్లా కార్యదర్శిగా వంశీవర్ధన్‌రెడ్డి ఎన్నికయ్యారు.