
భారీ వర్షాలు కురిసినా తట్టుకొనేలా వ్యవస్థల ప్రక్షాళన
● నీటి ప్రవాహానికి వీలుగా డ్రైనేజీలు, ట్రాఫిక్ చిక్కుల్లేకుండా చర్యలు ● చెరువులు, కుంటలు, నాలాలు ఎస్టీపీల ద్వారా మూసీకి అనుసంధానం ● అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవం ద్వారానే వరద నీటిని సమర్థంగా నిర్వహించవచ్చని ఆయన పేర్కొన్నారు. వర్షాలతో నగర జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండాలంటే శాశ్వత ప్రాతిపదికన అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందేళ్ల భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకొని కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం నగరానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. గురువారం రాత్రి హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షంతో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్‌లో మరోసారి పునరావృతం కాకుండా అనుసరించాల్సిన తక్షణ, శాశ్వత చర్యలపై అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలను తీసుకున్నారు.
వాతావరణ మార్పులతోనే..
నగరంలో గురువారం రాత్రి కుండపోత వర్షానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని, అందు కు తగినట్లుగా నగరంలో అన్ని వ్యవస్థలను ఆధునికీకరించాల్సిన అవసరముందని ఈ సందర్భంగా సీఎం అభిప్రాయపడ్డారు. భారీ వర్షాలతో తలెత్తే ఈ విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు విపత్తుల నివారణ నిర్వహణ ప్రణాళిక సమ ర్థంగా అనుసరించాలని ఆదేశించారు. ఎలాంటి భారీ వర్షాన్నైనా తట్టుకొనేలా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును వెంటనే చేపట్టాలన్నారు. నగరంలో 55 కిలోమీటర్ల పొడవునా మూసీని పునరుద్ధరించటం ద్వారా పరీ వాహక ప్రాంతంతో పాటు అన్ని ప్రాంతాలు, కాలనీలకు వరద ముప్పును నివారించవచ్చన్నారు.
మూసీలో వరద నీరు చేరేలా..
ఓఆర్‌ఆర్ లోపల ఉన్న కోర్ అర్బన్ ప్రాంతంలో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, మీరాలం చెరువులతో పాటు అన్ని చెరువులు, కుంటలను నాలాల ద్వారా మూసీకి అనుసంధానం చేయాలన్నారు. డ్రైనేజీల ద్వారా వచ్చే నీటిని ఎస్టీపీ (సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల) ద్వారా శుద్ధి చేసి మూసీలోకి వదలాలని చెప్పారు. నగరంలో ఎక్కడ వర్షం పడినా మూసీలోకి చేరేలా అనుసంధానం జరగాలన్నారు. ప్రాజెక్టును వరద నీటి నిర్వహణకు వీలుగా డిజైన్ చేయాలని చెప్పారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పాత నగరంలో పెడిస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టాలని సూచించారు. చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ప్రాంతాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్‌ఎండీఏ పరిధిలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీ ఇలంబర్తి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, జేఎండీ గౌతమి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.