ధాన్యం ప్రభుత్వమే కొంటుంది | Sakshi
Sakshi News home page

ధాన్యం ప్రభుత్వమే కొంటుంది

Published Tue, Dec 5 2023 5:28 AM

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌ - Sakshi

దోమ: జిల్లాలో మొత్తం 122 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని.. ఏ రైతు కూడా దళారులను ఆశ్రయించి మోసపోవద్దని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌ సూచించారు. సోమవారం దోమ మండల కేంద్రంలో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్‌తో కలసి అడిషనల్‌ కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన వసతులను కల్పించామని అన్నారు. గొనెసంచులు, టార్ఫాలిన్లు, తూకం యంత్రాలు, తేమ పరిశీలించే యంత్రాలను అందుబాటులో ఉంచామన్నారు. తేమశాతం 17 ఉండేలా వరి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఏ–గ్రేడ్‌ మద్దతు ధర రూ.2,203, బి–గ్రేడ్‌ మద్దతు ధర రూ.2,183గా రైతులకు ఇస్తామన్నారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు రవాణా సదుపాయాన్ని కూడా కల్పించామని అన్నారు.

ఫిర్యాదు చేయండి

జిల్లా వ్యాప్తంగా ఈ వానకాలంలో పండించిన సూమారు 2.30 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌ తెలిపారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్వహకులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. తూకాల్లో మోసాలు ఉంటే చర్యలు తప్పవన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తితే రైతులు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. విచారణ జరిపి వెంటనే అట్టి కొనుగోలు కేంద్రం నిర్వహకుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ ఇన్‌చార్జి సంతోష్‌, నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

దళారులను ఆశ్రయించి మోసపోవద్దు

అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌

దోమలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

Advertisement
 
Advertisement