కూటి కోసం కూలికెళ్తే ! | - | Sakshi
Sakshi News home page

కూటి కోసం కూలికెళ్తే !

Jul 21 2023 5:30 AM | Updated on Jul 21 2023 10:15 AM

- - Sakshi

వికారాబాద్‌: పొట్టకూటి కోసం ఓ ఫ్యాక్టరీలో కూలికి వెళ్లిన వ్యక్తిని మృత్యువు కబళించింది. భారీ క్రేన్‌ పైనపడటంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన లక్ష్మీదేవిపల్లిలోని సుగుణ స్టీల్‌ ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. స్టానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధారూరు మండలం ఇంతగుంట గ్రామానికి చెందిన రాములు(30) పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలోని సుగుణ స్టీల్‌ ఫ్యాక్టరీలో కూలి పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి క్రేన్‌ సాయంతో స్టీల్‌ లోడ్‌ చేస్తుండగా ఒక్కసారిగా క్రేన్‌ పైన పడింది. దీంతో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే మా కుమారుడు మృతి చెందాడని మృతుని బంధువులు వాపోయారు. ఫ్యాక్టరీలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని వారు తెలిపారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఎలాంటి భద్రతలు యాజమాన్యం పాటించడంలేదని వారు మండిపడ్డారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

యాజమాన్యంపై చర్యలకు డిమాండ్‌

లక్ష్మీదేవిపల్లిలోని సుగణ స్టీల్‌ ఫ్యాక్టరీలో ఎలాంటి భద్రతా చర్యలు కానరావడంలేదని, కూలీ మృతికి యాజమాన్యమే బాధ్యత వహించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్‌ రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందన్నారు.

ప్రతి ఏటా ఒకరిద్దరు మృతి చెందుతున్నా యాజమాన్యం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కంపెనీలో సేఫ్టీ పరికరాలు ఏమీ లేకుండానే పనులు చేయిస్తున్నారన్నారు. కార్మికులపై ఒత్తిడి తీసుకువచ్చి పనులను చేయిస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. వెంటనే ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు సత్తయ్య, యాదగిరి, శేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement