నో బాటిల్.. ఓన్లీ కాటన్!
పరిగి: పరిగి పట్టణంలోని మద్యం దుకాణాల యజమానుల సిండికేట్‌గా ఏర్పడి మద్యం ప్రియులకు చుక్కలు చూపిస్తున్నారు. పట్టణ పరిధిలోని బహార్‌పేట్‌లో ఒకే దగ్గర రెండు వైన్స్ షాపులు ఏర్పాటు చేశారు. రెండింటిలోనూ అమ్మకాలు ఆపేశారు. వీటి నుంచి బెల్టు షాపులకు మాత్రమే విక్రయిస్తున్నారు. మద్యం కొనుగోలు కోసం ప్రజలు వెళ్తే లేదని సమాధానం చెబుతున్నారు. ఇతర ప్రాంతాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. ఇదేం అని ప్రశ్నిస్తే.. ఇక్కడ బాటిల్‌గా విక్రయించం.. ఆర్డర్లు, కాటన్లు మాత్రమే అమ్ముతామని చెబుతున్నారు. దీంతో మద్యం ప్రియులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొన్ని సార్లు షాపు నిర్వాహకులు.. కొనుగోలుదారుల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంటోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి అధిక ధరలకు విక్రయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.
బెల్టు షాపులకే..
ఇటీవల పరిగి పట్టణానికి ఏడు మద్యం దుకాణాలు మంజూరయ్యాయి. టెండరు దక్కించుకున్న వారు ఆయా ప్రాంతాల్లో షాపులు ఏర్పాటు చేసుకున్నారు. యజమానులు సిండికేట్‌గా ఏర్పడి వ్యాపారం చేస్తున్నారు. ఐదు దుకాణాల్లో మద్యం విక్రయించాలని, రెండు షాపుల నుంచి బెల్టు షాపులకు పంపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బహార్‌పేట్‌లోని రెండు దుకాణాల్లో అమ్మకాలు ఆపేశారు. కేవలం బెల్టు షాపులకు విక్రయిస్తూ సొమ్మ చేసుకుంటున్నారు. ఎవరైనా ఈ షాపులకు వెళ్లి మద్యం కావాలని అడిగితే లేదని చెబుతున్నారు.
నిబంధలకు విరుద్ధంగా..
మద్యం పాలసీకి విరుద్ధంగా పట్టణంలో దుకాణాలు నడుపుతున్నారు. ఎంపిక చేసిన ప్రాంతంలోనే షాపు ఏర్పాటు చేసి మద్యం విక్రయించాలి. కానీ యజమానులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. బెల్టు షాపులు నిషేధమని తెలిసినా యథేచ్ఛగా వాటికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా గ్రామాలో తిరుగుతూ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. కిరాణా దుకాణాలు, హోటళ్లలో వైన్ అమ్మాలని కోరుతున్నట్లు తెలిసింది. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు.
వైన్ షాప్ నిర్వాహకుల వింత పోకడ
సిండికేట్‌గా మారిన యజమానులు
రెండు దుకాణాల స్టాక్ మొత్తం బెల్టు షాపులకే..
అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు


