నూనెగింజల సాగుతో లాభాలు
● కలెక్టర్ ప్రతీక్‌జైన్
● మరియాపూర్‌లో కుసుమ పంట పరిశీలన
పూడూరు: రైతులు కూరగాయలు, వాణిజ్య పంటలే కాకుండా నూనె గింజల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. బుధవారం మండలంలోని మరియాపూర్‌లో నూనెగింజల పరిశోధన సంస్థ విత్తన విభాగం ఆధ్వర్యంలో కుసుమ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఐఎస్‌ఎఫ్ –764 రకం కుసుమ విత్తనాన్ని ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు సంప్రదాయ పంటలతోపాటు కుసుమ, నూనె గింటల పంటలను సాగు చేయాలని సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో 2.26 లక్షల ఎకరాల్లో కుసుమ పంట సాగవుతోందని తెలిపారు. రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉందన్నారు. సాగులో నూతన పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొందాలని సూచించారు. పంట మార్పిడి చేస్తే లాభాలు వస్తాయన్నారు. అనంతరం నూనె గింజల పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్‌కె మాధూర్, విత్తన విభాగం అధిపతి డాక్టర్ జవహర్ మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఏఓ ప్రభాకర్, సర్పంచ్ పద్మ, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.


