ఫస్ట్‌ సిటిజన్స్‌ చేతికి ఎస్‌వీబీ | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ సిటిజన్స్‌ చేతికి ఎస్‌వీబీ

Published Tue, Mar 28 2023 6:22 AM

Silicon Valley Bank purchased by First-Citizens Bank - Sakshi

న్యూయార్క్‌: సంక్షోభంతో మూతబడిన సిలికాన్‌ వేలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ) సింహభాగం కార్యకలాపాలను ఫస్ట్‌ సిటిజన్స్‌ బ్యాంక్‌ దక్కించుకుంది. దీంతో ఎస్‌వీబీకి చెందిన అన్ని డిపాజిట్లు, రుణాలు ఫస్ట్‌ సిటిజన్స్‌ బ్యాంక్‌ అండ్‌ ట్రస్టుకు బదిలీ అవుతాయి. ఎస్‌వీబీ కస్టమర్లు ఆటోమేటిక్‌గా ఫస్ట్‌ సిటిజన్స్‌ ఖాతాదారులుగా మారతారని ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీఐసీ) తెలిపింది. ఫస్ట్‌ సిటిజన్స్‌లో ఎఫ్‌డీఐసీకి 500 మిలియన్‌ డాలర్ల విలువ చేసే షేర్లు దక్కుతాయి.

ఎస్‌వీబీకి చెందిన 167 బిలియన్‌ డాలర్ల అసెట్లలో 90 బిలియన్‌ డాలర్ల అసెట్లు ఎఫ్‌డీఐసీ వద్దే ఉంటాయి. 72 బిలియన్‌ డాలర్ల అసెట్లు, ఫస్ట్‌ సిటిజన్స్‌ బ్యాంక్‌కు భారీ డిస్కౌంటుపై 16.5 బిలియన్‌ డాలర్లకు దక్కుతాయి. ఎస్‌వీబీ వైఫల్యంతో డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ ఫండ్‌పై 20 బిలియన్‌ డాలర్ల మేర ప్రభావం పడనుంది. ఎస్‌వీబీ దెబ్బతో కుదేలైన ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు అమెరికాలోని 11 భారీ బ్యాంకులు దాదాపు 30 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీని అందించాయి.  
1898లో ఏర్పాటైన ఫస్ట్‌ సిటిజన్స్‌ బ్యాంక్‌ .. నార్త్‌ కరోలినాలోని రాలీ ప్రధాన కేంద్రంగా పని చేస్తోంది. 100 బిలియన్‌ డాలర్ల పైచిలుకు అసెట్లతో 21 రాష్ట్రాల్లో 500 శాఖలు ఉన్నాయి. బ్యాంకు ఆర్థిక పరిస్థితిపై అనుమానాలతో ఖాతాదారులు తమ డిపాజిట్లను భారీగా వెనక్కి తీసుకుంటూ ఉండటంతో మార్చి 10న ఎస్‌వీబీ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకు సిగ్నేచర్‌ బ్యాంక్‌ కూడా మూతబడింది.

Advertisement
Advertisement