Jodeghat Museum: జోడెన్‌ఘాట్‌ వీరభూమి

Komaram Bheem Jode Ghat museum attract tourists - Sakshi

‘కుమ్రుం భీము గిరిజన సంగ్రహాలయం’ ఇది ట్రైబల్‌ మ్యూజియం. ఆదివాసీల జీవనశైలితోపాటు కుమ్రుం భీము జీవితాన్ని బొమ్మల్లో చూపించే ప్రయత్నం. కొండ అద్దంలో ఇముడుతుందేమో కానీ కుమ్రుం భీము పోరాటం, జీవితాశయ సాధనలను ప్రతిబింబించడానికి ఒక మ్యూజియం సరిపోదు, ఇలాంటి పది మ్యూజియాలు కావాలి. ఈ మ్యూజియం కుమ్రుంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా, కెరిమెర మండలం, జోడెన్‌ఘాట్‌ గ్రామంలో ఉంది. 

జోడెన్‌ఘాట్‌లో కుమ్రుం భీము సమాధి, సమాధి పక్కనే భీము చేత్తో తుపాకీ పట్టుకున్న విగ్రహం ఉన్నాయి. విగ్రహం ఎదురుగా మ్యూజియం ఉంది. ఇందులో ఆదివాసీలు ఉపయోగించే వస్తువులు, పాత్రలు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ, ఆభరణాల అలంకరణ, పెళ్లి వేడుక చిత్రాలు, వేడుకలు, దేవతాపూజ సన్నివేశాలను కళ్లకు కట్టారు. వీటన్నింటిలో మేటిగా కుమ్రుం భీము జీవితావిష్కరణ కనిపిస్తుంది. మ్యూజియంలోకి ప్రవేశించగానే ఎడమ వైపు ఒక నాయకుడు, పది మంది అనుచరుల శిల్పాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. మధ్యలో ఉన్నది భీము. 

ద్వారానికి కుడివైపు భీము ఫొటో, విగ్రహంతోపాటు భీము భార్య సోమ్‌బాయి ఫొటో ఉంది. ఆ పక్కనే భీముతో కలిసి పని చేసిన కుమ్రుం సూరు ఫొటో, వేడమ రాము ఫొటో కూడా. భీము ఆచూకీ కోసం నిజాం మనుషులు గాలిస్తున్న సమయంలో ప్రమాదం ముంచుకు వస్తోందని హెచ్చరించడానికి రాము కాలికొం అనే వాద్యాన్ని ఊది భీమును, భీము బృందాన్ని అప్రమత్తం చేసేవాడు. ఈ మ్యూజియానికి పక్కనే ఉన్న ఆశ్రమ పాఠశాలలో భీము మనుమరాలు సోమ్‌బాయి ఉంది. ఆ స్కూల్లో చదువుకుంటూ కాదు, పాఠాలు చెప్తూ కూడా కాదు. స్కూలు పిల్లలకు భోజనం వండి పెట్టే ఉద్యోగంలో ఉందామె. భీము గౌరవార్థం సభలకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. జిల్లాకు పేరు కూడా పెట్టింది. కానీ అతడి వారసుల ఉపాధి గురించి పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. అంతేకాదు... భీముకు ఇస్తున్న గౌరవం అతడి పోరాటానికి ఇవ్వడం లేదని తెలిసినప్పుడు కూడా ఆశ్చర్యమేస్తుంది.

భూమి కోసం పోరాటం
కుమ్రుం భీము పుట్టింది ఆసిఫాబాద్‌ జిల్లా సంకేపల్లిలో. నిజాం పాలన కాలంలో రెవెన్యూ శాఖ వేధింపులు ఎక్కువగా ఉండేవి. పంటను ఐదు వంతులుగా విభజించి మూడు వంతులు ప్రభుత్వానికి కట్టాల్సి వచ్చేది. పండించిన వాళ్లకు రెండు వంతులు మాత్రమే మిగిలేది. ‘ఇదేం న్యాయం’ అని ప్రశ్నించిన భీము కుటుంబాన్ని స్థానిక పటేదారు వేధించడం మొదలుపెట్టాడు. భీము కుటుంబం ఊరు వదిలి సుర్దాపూర్‌కి పారిపోయింది. పటేదారు మనుషులు అక్కడికీ వచ్చారు. భీము ఆవేశం పట్టలేక పటేదారును కొట్టడంతో అతడు చనిపోతాడు. అప్పుడు భీము అడవుల్లోకి పారిపోతాడు. అడవుల నుంచి అస్సాంకు వెళ్లి ఆరేడేళ్ల పాటు అక్కడే ఉండి చదవడం, రాయడం నేర్చుకుని తిరిగి సుర్దాపూర్‌కొస్తాడు. 

అప్పటి నుంచి ఆదివాసీలకు సాగు చేసుకుంటున్న భూమి మీద సంపూర్ణ హక్కుల కోసం మరింత పటిష్టంగా పోరాడడం మొదలు పెట్టాడు. అనేక దరఖాస్తులు పెట్టాడు. నిజాంను స్వయంగా కలిసి విన్నవించుకోవడానికి పదిహేను మంది ఆదివాసీలతో హైదరాబాద్‌కు వెళ్లాడు. నిజామ్‌ అనుమతి ఇవ్వకపోవడంతో తన స్వస్థలంలోనే పోరాడాలని నిర్ణయించుకుని వెనక్కి వచ్చేశాడు భీము. అప్పటి నుంచి శిస్తు కట్టమని అడిగిన పటేదార్లను, రెవెన్యూ అధికారులను ధిక్కరించడమే ధ్యేయంగా పోరాటం తీవ్రతరం చేశాడు. వీరి స్థావరం కొండ మీద జోడెన్‌ఘాట్‌కు సమీపంలో ఉన్న భాభేఝరి. ఇక్కడి నుంచి ఉద్యమాన్ని నడిపాడు భీము. చుట్టు పక్కల 14 గ్రామాలను ప్రభావితం చేశాడు. 

భీము పోరాటాన్ని అణచివేయడానికి నిజాం సైన్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. రెండు వందల మందితో కూడిన భీము సైన్యం రెండు నెలల పాటు నిజాం సైన్యాన్ని విజయవంతంగా నిలువరించగలిగింది. భీము అనుచరుల్లో ‘కొద్దు’ అనే వ్యక్తి రోజూ కొండ కిందకు వెళ్లి భీము బృందానికి అవసరమైన ఆయుధాలు, ఆహారాన్ని కొండమీదకు తెచ్చేవాడు. అతడిని వేధించి, ప్రలోభ పెట్టిన నిజాం సేనలు ఎట్టకేలకు భీము కదలికలను పసిగట్టాయి. భీము ఉన్న కొండకు వెనుక వైపు మోవాడ్‌ ప్రాంతం నుంచి నిజాం సేనలు వచ్చి జోడెన్‌ఘాట్‌లో ఉన్న భీమును తుపాకీతో కాల్చి చంపేశాయి. భీము అక్కడికక్కడే తుది శ్వాస వదిలాడు. ఇది జరిగింది 1940, ఆశ్వయుజ పౌర్ణమి రోజున. అప్పటికి అతడి వయసు 39. 

నిజాం పాలకులు తుపాకీ తూటాతో భీము ఆశయానికి గండికొట్టారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా నిశ్శబ్దంగా అదే పంథాను కొనసాగిస్తున్నాయి. భీము ఏ ఆశయం కోసం పోరాడాడో ఆ ఆశయం ఇప్పటికీ నెరవేరనే లేదు. స్థానిక ఆదివాసీలు ఇప్పటికీ పోడు భూముల మీద హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆదివాసీలు భీము జీవిత కథను వివరిస్తూ... మా చేతిలో తుపాకీ లేదు, కానీ తుపాకీ పట్టిన భీము స్ఫూర్తి మాలో ఉందని చెబుతున్నారు. ఈ పర్యటనలో తరాలకు కూడా తరగని స్ఫూర్తినిచ్చిన కుమ్రుం భీము జీవితం కళ్ల ముందు మెదలుతుంది.

చదవండి:
కురువపురం దీవి; కృష్ణమ్మ సిగలో చేమంతి

అండర్‌వాటర్‌లో మ్యూజియం.. అదెక్కడంటే?

Read latest Travel News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top