'వి' సినిమా రివ్యూ

V Telugu Movie Review And Rating - Sakshi

టైటిల్‌: వి
జానర్‌: క‌్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌
తారాగ‌ణం: నాని, సుధీర్ బాబు, నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి, వెన్నెల కిషోర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి త‌దిత‌రులు
ద‌ర్శ‌కుడు: ఇంద్రగంటి మోహనకృష్ణ
నిర్మాత: దిల్ రాజు
సంగీతం: అమిత్ త్రివేది
నేప‌థ్య సంగీతం: థ‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: పి.జి. విందా
విడుద‌ల తేదీ: 5-9-2020, అమెజాన్ ప్రైమ్‌

'అష్టా చ‌మ్మా' చిత్రంతో హీరో నాని ప్ర‌స్థానం మొద‌లైంది. తొలి చిత్రంతోనే నానికి బంపర్ హిట్‌ను అందించారు ద‌ర్శ‌కుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అయితే అనూహ్యంగా మ‌ళ్లీ ఆయ‌న డైరెక్ష‌న్‌లోనే నాని 25వ సినిమా చేయ‌డం విశేషం. ఇక‌ ఎప్పుడూ వైవిధ్య‌మైన పాత్ర‌ల‌కే మొగ్గు చూపే నాని ఈ సారి ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించ‌డంతో 'వి' సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రం నేడు(సెప్టెంబ‌ర్ 5న‌) అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల అయింది. లాక్‌డౌన్ త‌ర్వాత ఓటీటీలో విడుద‌లైన భారీ తెలుగు చిత్రం ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో యంగ్ హీరో సుధీర్‌బాబు, విల‌న్ ఛాయ‌లున్న పాత్ర‌లో నాని ప్రేక్ష‌కుల‌ను మెప్పించారా?  లేదా? ఈ ఇద్ద‌రిలో చివ‌రికి ఎవ‌రు హీరో అయ్యారో చూసేద్దాం...

క‌థ‌: డీసీపీ ఆదిత్య‌(సుధీర్ బాబు) ద‌మ్మున్మ పోలీసాఫీస‌ర్‌. గ్యాలంట‌రీ మెడ‌ల్ స‌హా ఎన్నో అవార్డులు అందుకున్న ఆయ‌న‌కు అత్యంత కిరాత‌కంగా హ‌త్య‌లు చేసే కిల్ల‌ర్ విష్ణు(నాని) ద‌మ్ముంటే త‌న‌నాప‌మ‌ని స‌వాలు విసురుతాడు. అత‌ని డిపార్ట్‌మెంట్‌లోని ఓ పోలీసును ఆయ‌న ఇంట్లోనే హ‌త్య చేస్తాడు. ఆ త‌రువాత ఒక్కొక్క‌రిని ర‌క‌ర‌కాలుగా చంపుతూ నెక్స్ట్ ఏంటి? అనేది క్లూ ఇస్తాడు. ఈ క్లూ తెలుసుకోగ‌లిగితే నేర‌స్థుడిని ప‌ట్టుకోవ‌చ్చ‌ని డీసీపీ త‌న ప్రేయ‌సి అపూర్వ‌ (నివేదా థామ‌స్) సాయం కోర‌తాడు.

కానీ చివ‌రికి అత‌ని మెద‌డులోనే మెరుపులాంటి ఆలోచ‌న చేరి అత‌నే ప‌జిల్ విప్పుతాడు. వెంట‌నే నేరస్థుడిని, అదే నానిని ప‌ట్టుకునేందుకు ప‌రుగెత్తుతాడు. కానీ విల‌న్ అంత వీక్ కాదు.. చిక్కిన‌ట్లే చిక్కి త‌ప్పించుకుని మ‌ళ్లీ హ‌త్యలు చేస్తుంటాడు. అస‌లు వీ ఈ హ‌త్య‌లు ఎందుకు చేస్తున్నాడు?  డీసీపీ ఆదిత్య‌కు ఎందుకు చాలెంజ్ విసిరాడు? ఆదిత్య కిల్ల‌ర్‌ను ప‌ట్టుకున్నాడా? లేదా? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే! (చ‌ద‌వండి: నేను హ్యాపీ అని ‘దిల్‌’రాజు అన్నారు)

విశ్లేష‌ణ‌:
సుధీర్‌బాబు ఎంట్రీ సీన్‌తోనే పోలీస్‌గా ప‌ర్ఫెక్ట్‌గా సూట‌య్యార‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత ఇన్‌స్పెక్ట‌ర్ హ‌త్య‌తో క‌థ‌లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు మోహనకృష్ణ. హంత‌కుడు ఎంతో సులువుగా ఒక్కొక్క‌రినీ చంపుకుంటూ వెళ్ల‌డం, అత‌డి కోసం డీసీపీ గాలించ‌డం వంటి స‌న్నివేశాల‌తోనే ఫ‌స్టాఫ్ న‌డుస్తుంది. డీసీపీకి హంత‌కుడు క‌నిపించి, త‌ప్పించుకోవ‌డంతో ప్ర‌థ‌మార్థం ముగుస్తుంది. ద్వితీయార్థం మ‌రింత ర‌క్తిక‌ట్టిస్తార‌నుకుంటే అలా జ‌ర‌గ‌లేదు. ఇక్క‌డ క‌థ‌నం నెమ్మ‌దించింది. హ‌త్య‌ల వెన‌క కార‌ణాన్ని తెలుసుకునేందుకు డీసీపీ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెడ‌తాడు. (చ‌ద‌వండి: పెంగ్విన్ మూవీ రివ్యూ)

అలా విష్ణు ఫ్లాష్‌బ్యాక్‌ వ‌స్తుంది.. ఇక్క‌డ స‌స్పెన్స్ రివీల్ కావ‌డంతో సినిమా అంత ఆస‌క్తిగా సాగ‌దు. ఇక హంత‌కుడి ఒప్పందం ప్ర‌కారం అత‌డిని ప‌ట్టుకోనందుకు డీసీపీ త‌న ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఆ త‌ర్వాత క్లైమాక్స్‌లో వ‌స్తుంది అస‌లు ట్విస్ట్. హ‌త్య‌ల వెన‌క కార‌ణాన్ని హంత‌కుడే తెలియ‌జేస్తాడు. కానీ ఈ త‌ర‌హా కార‌ణాలు చాలా సినిమాల్లో క‌నిపించాయి. అయితే అన్ని మెడ‌ల్స్ సాధించి, పెద్ద పేరు గ‌డించిన‌ డీసీపీ.. నేర‌స్థుడు క్లూ వ‌దిలినా ప‌ట్టుకోలేక‌పోవ‌డం కొంత లాజిక్‌గా అనిపించ‌దు. ద‌ర్శ‌కుడు రాసుకున్న క‌థ బాగానే ఉన్నా క‌థ‌నం అంత బ‌లంగా లేదు.

క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రం కాబ‌ట్టి కామెడీ చొప్పించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. కాక‌పోతే సీరియ‌ల్ కిల్ల‌ర్‌గా భ‌య‌పెట్టిన‌ నాని అక్క‌డ‌క్క‌డా చిలిపి నానిగా క‌నిపించారు. ప్ర‌తినాయ‌క పాత్ర‌లోనూ నాని సులువుగా న‌టించారు. హ‌త్య‌లు చేసేట‌ప్పుడు వ‌చ్చే డైలాగులు బాగున్నాయి. చివ‌రి రెండు హ‌త్య‌లు వెన్నులో వణుకుపుట్టిస్తాయి. న‌వ‌లా ర‌చ‌యిత‌గా, డీసీపీ ఆదిత్య ప్రేయ‌సిగా అపూర్వ పాత్ర‌లో నివేదా థామ‌స్ రాణించారు. క‌థ‌కు మూల‌మైన సాహెబ్ పాత్ర‌లో అదితిరావు హైద‌రి బాగా న‌టించారు. మిగ‌తావారు త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. కొన్నిచోట్ల వ‌చ్చే సంగీతం 'రాక్ష‌సుడు' థీమ్ మ్యూజిక్‌ను గుర్తు చేస్తుంది. పాట‌లు ప‌ర్వాలేదు. పి.జి. విందా సినిమాటోగ్ర‌ఫీకి తిరుగులేదు. (చ‌ద‌వండి: ‘వి’ తర్వాత అభిమానులు పెరుగుతారనుకుంటున్నా!)

ప్ల‌స్‌:
నాని, సుధీర్‌బాబుల న‌ట‌న‌
ఫ‌స్టాఫ్‌
మైన‌స్‌:
క‌థ‌నం బ‌ల‌హీనంగా ఉండ‌టం
సెకండాఫ్ నెమ్మ‌దించ‌డం

ఒక్క‌మాట‌లో: ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు మ్యాచ్ అవలేదు.

Rating:  
(2.75/5)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Tollywood News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top