Happy Birthday Sai Kumar: డైలాగ్‌ కింగ్‌.. అమితాబ్‌కు డబ్బింగ్‌ చెప్పిన సినిమా ఏదో తెలుసా?

Actor Sai Kumar Birthday Special Story And Interesting Facts In Telugu - Sakshi

‘‘ఒక్కసారి పురాణాలు దాటి వ‌చ్చి చూడు, అవ‌స‌రాల కోసం దారులు తొక్కే పాత్రలే త‌ప్ప, హీరోలు, విల‌న్‌లు లేరీ నాట‌కంలో’’.. తెలుగు సినీ చరిత్రలో కలకలం గుర్తుండిపోయే డైలాగ్‌ ఇది. ‘ప్రస్థానం’ ద్వారా ఈ ఆణిముత్యం లాంటి డైలాగ్‌ను అందించిన క్రెడిట్‌ సగం దర్శకుడు దేవకట్టాది అయితే.. తన నటనతో, కంఠంతో పవర్‌ఫుల్‌గా ఆ డైలాగ్‌ను ప్రజెంట్‌ చేసి మిగిలిన సగభాగం క్రెడిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు నటుడు సాయి కుమార్‌. డైలాగ్‌ కింగ్‌గా, అంతకు మించి విలక్షణ నటుడిగా తెలుగు, కన్నడ ప్రేక్షకుల అభిమానాన్ని చురగొంటూ వస్తున్నాడాయన. ఇవాళ ఆయన 61వ పుట్టినరోజు.. 

పుడిపెద్ది సాయి కుమార్‌..1960 జులై 27న జన్మించాడు. తండ్రి డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ కమ్‌ నటుడు పీజే శర్మ సొంతూరు విజయనగరం,  తల్లి నటి జ్యోతి బెంగళూరువాసి. చెన్నైలో ఎంఫిల్‌ విద్య పూర్తి చేసుకున్నాక.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో ఆవైపు ఆకర్షితుడయ్యాడు సాయి కుమార్‌. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా డబ్బింగ్‌ సినిమాలకు పని చేసిన ఆయన.. పెద్దయ్యాక కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానే కొనసాగాడు. 1977లో ‘స్నేహం’ ద్వారా నటనలోకి అడుగుపెట్టాడు. స్పష్టమైన తెలుగు ఉచ్ఛారణ.. పవర్‌ఫుల్‌ టోన్‌ కావడంతో బిజీ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఆయనకు గుర్తింపు దక్కింది. మధ్య మధ్యలో చిన్నాచితకా పాత్రలు చేసినప్పటికీ..పూర్తిస్థాయి నటుడి గుర్తింపుదక్కలేదు. అలాంటి టైంలో.. 

అగ్ని.. ఆ...
ఏం జరిగిందో ఏమోగానీ.. డబ్బింగ్‌ కోసం కొందరు హీరోలు వేరే వాళ్ల వాయిస్‌ అరువు తెచ్చుకోవడం, మరో వైపు హీరో-ఆర్టిస్ట్‌గా అవకాశాలు పల్చబడడంతో సాయి కుమార్‌ ఢీలా పడిపోయాడు. సరిగ్గా ఆ టైంలో థ్రిల్లర్‌ మంజు డైరెక్షన్‌లో వచ్చిన ‘పోలీస్‌ స్టోరీ’ సాయి కుమార్‌ సినీ ‘జీవితాన్ని’ నిలబెట్టింది. కన్నడ నటుడు కుమార్‌ గోవింద్‌ చేయాల్సిన ఆ సినిమా అనుకోకుండా సాయి కుమార్‌ దగ్గరికి వెళ్లడం.. ఆయన సినీ కెరీర్‌ను మలుపు తిప్పింది. 1996లో కన్నడనాట ‘పోలీస్‌ స్టోరీ’ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు తమిళ, తెలుగు భాషల్లోనూ సినిమా సంచలన విజయాన్ని  సాధించింది. ఆవేశం ఉన్న పోలీసాఫీసర్‌ అగ్ని పాత్రలో కలకాలం గుర్తుండిపోయే అమోఘమైన నటన అందించాడాయన. ‘సత్యా.. ధర్మా.. అమ్మా..’ అంటూ ఎమోషనల్‌గా చెప్పే డైలాగులు, విలన్లను ఉద్దేశించి ‘ ఏయ్‌ లబ్బే’ అంటూ ఊగిపోతూ చెప్పే పవర్‌ఫుల్‌ పంచ్‌ డైలాగులు ఇప్పటికీ జనాల చెవులో మారుమోగుతుంటాయి. ఆ సినిమాతో కన్నడనాట స్టార్‌ హీరోగా ఆయనకంటూ ఓ గుర్తింపు దక్కింది.

నటనా ప్రస్థానం
కన్నడలో హీరోగా ఫేడవుట్‌ అయ్యాక.. తిరిగి టాలీవుడ్‌లో, మధ్య మధ్యలో కన్నడ, తమిళంలోనూ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యాడు సాయి కుమార్‌. 2002 తర్వాత సుమారు నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత ‘సామాన్యుడు’ రూపంలో ఆయన కెరీర్‌ మలుపు తిరిగింది. ఆ సినిమాకుగానూ బెస్ట్‌ విలన్‌గా టాలీవుడ్‌లో తొలి నంది అవార్డును అందుకున్నారు ఆయన. ఆ తర్వాత ‘ప్రస్థానం’ లోక్‌నాథ్‌ నాయుడు రోల్‌ రూపంలో మరిచిపోలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతేకాదు బెస్ట్‌ సపోర్టింగ్‌ నటుడిగా రెండో నందిని అందించింది. ఆపై ‘అయ్యారే, ఎవడు, పటాస్‌, సరైనోడు, సుప్రీం, జనతా గ్యారేజ్‌, జై లవ కుశ, రాజా ది గ్రేట్‌, మహర్షి.. ఇలా కమర్షియల్‌ డ్రామాలతో కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ మధ్యలో కన్నడనాట ‘రంగితరంగ’ ఇంటర్నేషనల్‌ ఫేమ్‌ తెచ్చిపెట్టింది.  వెండితెరపైనే కాదు.. ‘కట్‌ చేస్తే’ బుల్లితెరపై కూడా హోస్టింగ్‌తో మెప్పిస్తూ వస్తున్నారాయన.

వాయిస్‌తో మ్యాజిక్‌
సుమన్‌, రాజశేఖర్‌ల కెరీర్‌కు సాయి కుమార్‌ అందించిన గొంతుక ఒక ‘పుష్‌అప్‌’ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాషా, పెదరాయుడు ద్వారా రజినీకాంత్‌ను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసింది కూడా ఈయన గొంతే. ఇక బాలీవుడ్‌ మెగాస్టర్‌ అమితాబ్‌ బచ్చన్‌కు ‘ఖుధా గవా’(1992) ‘కొండవీటి సింహం’ పేరుతో తెలుగులోకి డబ్‌ కాగా.. అందులో బిగ్‌బీకి వాయిస్‌ఓవర్‌ అందించాడు సాయి కుమార్‌. మోహన్‌లాల్‌, మమ్మూటీ, మనోజ్‌ జయన్‌, అర్జున్‌ సార్జా, విష్ణువర్ధన్‌ పోలీస్‌ రోల్స్‌కిగానూ సురేష్‌ గోపీ, విజయ్‌కాంత్‌ లాంటి వాళ్లకు తన పవర్‌ఫుల్‌ వాయిస్‌ అందించి.. ఆయా నటులను తెలుగు ఆడియొన్స్‌కు దగ్గరయ్యేలా చేశాడు డైలాగ్‌ కింగ్‌ సాయి కుమార్‌.

-సాక్షి, వెబ్‌డెస్క్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top