తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదు. గత సెప్టెంబర్‌లో కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులిచ్చి చేతులు దులుపుకున్నారు. జిల్లాలో 55వేల మంది అర్హులైన వారు దరఖాస్తులు చేసుకున్నారు. అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు ఇస్తారని ఆశపడ్డారు. కానీ డిసెంబర్ వచ్చినా ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదు. ఇదిలావుండగా సామాజిక భద్రతా పింఛన్లు నవంబర్‌లో 2,59,169 మందికి గాను డిసెంబర్‌కు 2,58,623 మందికి మాత్రమే మంజూరైనట్లు శుక్రవారం అధికారులు వెల్లడించారు. గత నెలతో పోల్చుకుంటే 546 పింఛన్లు తగ్గించేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఇప్పటివరకు 16,500 పింఛన్లు తగ్గించేశారు. ఈనెల 30న పింఛన్ల పంపిణీ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
అన్ని రంగాల్లో రాణించాలి
తిరుపతి అర్బన్: విద్యార్థులు బాల్యం నుంచే అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా ఎన్నికలపై అవగాహన పెంపొందించడానికి, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నేతృత్వంలో క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలైన విద్యార్థులను శుక్రవారం కలెక్టరేట్‌కు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, డీఆర్వో నరసింహులుతో కలసి విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేశారు.
మిగిలిన నర్సింగ్ సీట్ల భర్తీకి 30న కౌన్సెలింగ్
తిరుపతి తుడా: స్విమ్స్ యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం ఆఫ్‌లైన్ విధానం ద్వారా ఈనెల 30న 4వ విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో సోమవారం 9 గంటలకు పద్మావతి మెడికల్ కళాశాల, స్విమ్స్ ప్రాంగణంలో జరిగే కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు స్విమ్స్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.
పోస్టల్ బ్యాలెట్‌కు
1,292 ఓట్లు
తిరుపతి అర్బన్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 29న 19 మండలాల పరిధిలోని 373 పంచాయతీల్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రెండో విడత పోలింగ్ డ్యూటీలో ఉన్న ఉద్యోగుల కోసం 19 మండలాల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 1,292 మంది ఉద్యోగులు మాత్రమే తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడిగా వంశీ
తిరుపతి మంగళం : వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతికి చెందిన మొక్కల వంశీ (మార్కెట్ వంశీ) నియమితులయ్యారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. తనకు ఈ పదవి రావడానికి కృషిచేసిన వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి జిల్లా అధ్యక్షుడు, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఒక్క ఓటుతో గెలుపు
తిరుపతి అర్బన్: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు 268 చోట్ల నిర్వహించారు. అయితే పలువురు సర్పంచ్‌లు ఒకటి, రెండు, ఆరు ఓట్లతేడాతో విజయం సాధించారు. నారాయణవనం మండలంలోని బొప్పరాజుపాళెం పంచాయతీలో సి.పల్లవి కేవలం ఒక్క ఓటుతో తేడాతో విజయం సాధించారు. అలాగే పెనగలూరు మండలంలోని కోమంతరాజుపురం పంచాయతీలో గుత్తి పెంచలయ్య రెండు ఓట్లతో, తొట్టంబేడు మండలం, తాటిపర్తి పంచాయతీలో టి.అరుణమ్మ రెండు ఓట్లతో విజయం సాధించారు.


